ప్రక్షాలన షురూ... 3O అంశాలతో యాక్షన్ ప్లాన్ రెడీచేసిన చంద్రబాబు సర్కార్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ ప్రక్షాలన చేపట్టింది. ఇందులో భాగంగాానే వైద్యారోగ్య శాఖలో 30 అంశాలతో కూడిన యాక్షన్ ప్లాన్ చేపట్టింది. ఆ అంశాలివే...
Satyakumar Yadav
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాలన చేపట్టింది చంద్రబాబు సర్కార్. గత వైసిపి పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నింటిని విధ్వంసం చేసారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందువల్లే ఈ వ్యవస్థలన్నింటిని పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే తెలిపారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యసేవల్లో నాణ్యత పెంచెందుకు 30 అంశాలతో యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Satyakuamar Yadav
వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చేవారికి మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగుపడాల్సిన 30 అంశాలను గుర్తించామని... ఇందులో కొన్నింటిని వెంటనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇలా స్వల్ప కాలంలో పూర్తిచేసే పనులతో మధ్య, దీర్ఘకాలిక పనులను గుర్తించామని... త్వరలోనే అన్నిపనులు పూర్తిచేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రిన్సిపాళ్లు, జిజిహెచ్ సూపరింటెండెంట్లు, ఇతర ఆసుపత్రుల ప్రతినిధులతో మేధోమదన కార్యక్రమాన్ని నిర్వహించి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.
Satyakuamar Yadav
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్య కార్యక్రమాలను మెరుగుపర్చి ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఓపీ సేవల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడటం, రోగులకు సహకరించేందుకు హెల్త్ డెస్కుల ఏర్పాటు, వైద్యుల పనితీరు, రోగనిర్ధారణ పరికరాలు, యంత్రాల పనితీరును పర్యవేక్షించడం, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చడం, వైద్యాధికారులు, సిబ్బంది కొరత నివారణకై ఖాళీ పోస్టులను భర్తీ, సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు అధునాతన శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకురావడం... ఇలా 30 అంశాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. వీటిపై స్టడీ చేసి తగిన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.
Satyakuamar Yadav
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 వేల వైద్యాధికారుల సేవలు అవసరం ఉండగా 3,100 మంది కొరత ఉందన్నారు. కాబట్టి ఈ ఖాళీ పోస్టుల భర్తీకి తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇలా మూడు నుండి ఆరు నెలల కాలవ్యవధిలో స్వల్పకాలిక ప్రణాళికను పూర్తి చేస్తామని తెలిపారు. ఇక ఏడాది వ్యవధిలో మధ్యకాలిక ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు. దీర్ఝకాలిక ప్రణాళికల్లో భాగంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి సత్యుమార్ వెల్లడించారు.
స్వల్పకాలిక ప్రణాళికల్లో ఆసుపత్రుల ప్రాంగణాలను ఆహ్లదకరంగా తీర్చిదిద్దడం, టాయిలెట్ల, బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ను పటిష్టంగా నిర్వహించడం, స్ట్రెచర్లు, వీల్‌చైర్లు, మహాప్రస్థానం వాహనాలు అవసరం మేరకు సమకూర్చుకోవడం, మగ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్ఓ)లు, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్ఎన్ఓ)లు, ల్యాబ్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల కొరతను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీనియర్లు,స్పెషలిస్ట్ వైద్యులు తప్పనిసరిగా ఓపి విధులకు హాజరయ్యేలా చూడటం, టెస్టుల రిపోర్టు వివరాలు ఎస్.ఎం.ఎస్ ద్వారా రోగులకు తెలియజేయడం, ఆసుపత్రుల్లో అవినీతిని నియంత్రించేందుకై '104' కి కాల్ చేసి ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించడం, 108 సర్వీస్ సిబ్బంది, వైద్యుల మధ్య సమన్వయం ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఏడాది కాలంలో మధ్యకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా ఎక్స్-రే యంత్రాలు, సిటి స్కాన్లు, ఎంఆర్ఐ, వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్ సిస్టమ్స్ వంటి వివిధ రోగనిర్ధారణ పరికరాలు, యంత్రాలు అవసరాల మేరకు సమకూర్చుకోవడం,వివిధ విభాగాల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మరియు టెక్నీషియన్లు, ఎంఎన్ఓలు లేదా ఎఫ్ఎన్ఓలు వంటి కీలక పోస్టులను భర్తీ చేయడం, ఆపరేష్ థియేటర్లలో సూక్ష్మ జీవుల సంక్రమణ(ఇన్ఫెక్షన్ )ను నివారించడానికి శీతలీకరణ (ఏసీ) వ్యవస్థను పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అదే విధంగా దీర్ఘకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా అన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో-ఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, క్యాన్సర్ కేర్ (రేడియేషన్ ఆంకాలజీ, రేడియో థెరపీ మరియు సర్జికల్ ఆంకాలజీ) సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవ మార్పిడి సేవలను, వైద్యులకు సమర్థవంతమైన డిజిటల్ లైబ్రరీ సేవను అందుబాటులోకి తేవడంతో పాటు నాణ్యతతో కూడిన ఆధునిక వైద్య సేవలు అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి సత్యకుమార్ యావద్ తెలిపారు.