ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ లెనోవా యజమాన్యంలోని మోటరోలా చివరకు స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మోటో రేజర్ 5జిని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మోటరోలా నుండి రెండవ ఆండ్రాయిడ్ ఫోల్డబుల్ ఫోన్. కొత్త మోటో రేజర్ డిజైన్, మెరుగైన ఫీచర్స్, కెమెరా కాన్ఫిగరేషన్లలో చాలా మార్పులను తెచ్చింది. 

మోటో రేజర్ 5జి స్పెసిఫికేషన్లు ఊహించినట్లుగానే వినియోగదారులను ఆశ్చర్యపరిచింది.  దీని ధర 1,399 డాలర్లు(అంటే సుమారు రూ.1,02,600)తో లాంచ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫస్ట్-జెన్ మోటో రేజర్ ధర భారతదేశంలో రూ.1,24,000 కంటే ఎక్కువే.  

మోటో రేజర్ 5జి డిజైన్
మోటో రేజర్ 5జి డిజైన్ పరంగా పెద్ద అప్‌గ్రేడ్ చేసింది. పాత మోడల్లో లేని సెకండ్ డిస్ ప్లే దీనికి ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపుకు అందించారు.  మోటరోలా మరింత ప్రీమియం లుక్ కోసం దీనిని అద్భుతంగా డిజైన్ చేసింది. పాలిష్ చేసిన గ్రాఫైట్, బ్లష్ గోల్డ్, లిక్విడ్ మెర్క్యురీ వంటి మూడు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

మోటరోలా రజర్ 5 జి  ఫీచర్స్ 
మోటో రేజర్ 5జి 6.2-అంగుళాల పోల్డ్ డిస్‌ప్లే, ఫోన్ వెనుక భాగంలో సెకండరీ డిస్‌ప్లే ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్, 8జి‌బి ర్యామ్, 256జి‌బి  ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

also read స్మార్ట్‌ఫోన్‌ల కోసం కొత్త ఓఎస్‌.. వచ్చే ఏడాదిలో లాంచ్ : హువావే ...

కెమెరా విషయానికొస్తే మోటరోలా రేజర్ 5జిలో 48 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా ఎఫ్ 1.7 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ముందు వైపు ఎఫ్2.2 ఎపర్చరుతో 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

బ్యాటరీకి సంబంధించినంతవరకు మోటరోలా రేజర్ 5జిలో 15W టర్బోపవర్ ఛార్జర్‌ సపోర్ట్ తో 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 10ఓ‌ఎస్ తో పని చేస్తుంది, దీనిని కొత్తగా ప్రారంభించిన ఆండ్రాయిడ్ 11కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 192 గ్రా.

కనెక్టివిటీ కోసం మోటర్ రేజర్ బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి సపోర్ట్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంది.

మోటో రేజర్ 5జి ధర
మోటో రేజర్ 5జి 1,399డాలర్ల (సుమారు రూ .1,02,600) ధరతో విడుదల చేశారు. ఈ ఏడాది చివర్లో చైనీస్, యూరోపియన్ మార్కెట్లో మొదట అందుబాటులో ఉంటుంది. కానీ మోటో రేజర్ 5జి ఇండియాలో లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.