న్యూఢిల్లీ: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం హువావే మరో సరికొత్త మొబైల్‌ను భారత్‌లో విడుదల చేసింది. వెనుకవైపు నాలుగు కెమెరాలు కలిగి ఉండటం ఈ ఫోన్‌ ప్రత్యేకత. గత నెలలో పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్‌ను వెల్లడించిన హువావే ఇప్పుడు అతిపెద్ద మొబైల్‌ మార్కెట్‌ కలిగిన భారత్‌లోనూ విడుదల చేసింది. 

ఏప్రిల్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. ఈ నెల 16 నుంచి రెగ్యులర్ సభ్యులకు ఈ ఫోన్ లభిస్తుంది.వచ్చేనెల ప్రారంభంలో క్రోమా రిటైల్ స్టోర్లలో వినియోగదారులకు హువావే పీ 30 ప్రో ఫోన్ అందుబాటులోకి రానున్నది. 

దీని ధరను రూ.71,900గా నిర్ణయించారు. ఇక నాలుగు కెమెరాల హువావే స్మార్ట్ ఫోన్‌కు అదనంగా మరో రూ.2000 చెల్లిస్తే రూ.15,990 విలువైన హువావే వాచ్‌ జీటీ పొందవచ్చు. 

దీంతో పాటు హువావే పీ30లైట్‌ను కూడా కంపెనీ తీసుకొచ్చింది. ఇది 4జీబీ, 6జీబీ ర్యామ్‌ వేరియంట్లలో లభించనున్నది. ఈ ఫోన్‌ ధరలు వరుసగా రూ.19,900, 22,900. ఇక ప్రారంభ ఆఫర్‌ కింద రిలయన్స్‌ జియో రూ.2,200 క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తోంది. 

ప్రస్తుతం దక్షిణ కొరియా మేజర్ శామ్ సంగ్, టెక్ దిగ్గజం ఆపిల్ సారథ్యంలోని ‘ఐ-ఫోన్’ ఆధిపత్యం వహిస్తున్న ఆల్రా ప్రీమియం సెగ్మెంట్‌లోనూ హువావే పోటీనిచ్చేందుకు సిద్ధమైంది. అమెరికా డాలర్లతో పోలిస్తే 1000 డాలర్లు దాటుతోంది. ఇప్పటివరకు ఆపిల్ ‘ఐఫోన్లు’ మాత్రమే 1000 డాలర్లను దాటాయి.

ఇప్పటివరకు చైనా సంస్థల్లో ‘ఒప్పో’ కూడా ఆల్ట్రా ప్రీమియం సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టలేదు. విశ్లేషకుల అంచనా ప్రకారం 1000 డాలర్లు దాటితే హువావే కస్టమర్లంతా ఒప్పోవైపు మళ్లుతారని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ లో ఇతర సంస్థలను ఢీ కొట్టడం హువావే సంస్థకు సవాలేనని హువావే ఇండియా కన్జూమర్ బిజినెస్ గ్రూప్ కంట్రీ మేనేజర్ టొర్నాడో పాన్ తెలిపారు. అమెరికా డాలర్లలో హువావే పీ 30 ఫోన్ ధర 1038 డాలర్లు. హై ఎండ్ టెక్నాలజీతో దీన్ని అభివ్రుద్ధి చేశారు. తమకు భారత్ వ్యూహాత్మక మార్కెట్ అని టొర్నాడో పాన్ చెప్పారు.

సమీప భవిష్యత్‌లో లాప్ టాప్‌లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ (ఐఓటీ) డివైజ్ లు, వేరబుల్స్ అండ్ అదర్స్ ఉత్పత్తులను కూడా మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోందని టొర్నాడో పాన్ తెలిపారు. భారతదేశంలో తమ సంస్థలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా 90 శాతం ఫోన్ తయారీ భారతదేశంలోనే చేపడతామన్నారు. 

హువావే పీ30 ప్రోలో 6.47 అంగుళాల ఫుల్‌హెచ్‌+ డిస్‌ప్లే ఉంటుంది. 
8 జీబీ ర్యామ్‌ వేరియంట్ ఫోన్‌లో 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం అందుబాటులో ఉంటుంది. కిరిన్‌ 980 ప్రాసెసర్‌,  ఆండ్రాయిడ్‌ పై(ఇఎంయూఐ) వంటివి చేర్చారు. 

వెనుకవైపు 40+20+8మెగాపిక్సెల్‌ కెమెరాలతో పాటు, టైమ్‌ ఆఫ్‌ ఫ్లైట్‌ కెమెరా కూడా అమర్చారు. ఇక ఫ్రంట్ 32మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాతోపాటు 4,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ స్పెషాలిటీ.  15వాట్ల వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 40వాట్ల సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కావడం ఈ ఫోన్ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.