కరోనా మహమ్మారి అనేక మంది ప్రముఖులను బలితీకుంటుంది. ఆ మధ్య గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా కన్నుమూశారు. ఇటీవల రచయిత, వరుణ్‌ సందేశ్‌ తాత జీడిగుంట రామచంద్రమూర్తి కన్నుమూశారు. ఇప్పుడు మరో రైటర్‌ని కరోనా బలితీసుకుంది. తెలుగులో ప్రముఖ రచయితగా రాణిస్తున్న యువ కథా రచయిత వంశీ రాజేష్‌ కరోనాతో గురువారం కన్నుమూశారు. 

ఆయన గత కొంత కాలంగా కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమని విషాదంలో నింపారు. వంశీ రాజేష్‌ ఆకస్మిక మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. 

వంశీ రాజేష్‌.. శ్రీనువైట్ల దర్శకత్వంలో, రవితేజ నటించిన `అమర్‌ అక్బర్‌ ఆంటోని` సినిమాకు రైటర్‌గా పనిచేశారు. దీంతోపాటు శ్రీనువైట్ల, గోపీమోహన్‌ కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాలకు వర్క్ చేశారు. వీటిలో `మిస్టర్‌` కూడా ఉంది. ఇందులో రచనా సహకారం అందించారు. ఆయన చివరిగా `శబ్దం` సినిమాకు పనిచేశారు. ఇది రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. వంశీ మరణంతో దర్శకుడు శ్రీనువైట్ల స్పందిస్తూ, ప్రతిభావంతుడైన రచయిత వంశీ రాజేష్‌ మరణ వార్త విని షాక్‌కి గురైనట్టు తెలిపారు. చాలా బాధగా ఉందని, తన జీవితంలో మరిచిపోలేని వ్యక్తి అని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ, వంశీ ఆత్మకి శాంతి చేకూరాలని పేర్కొన్నారు.