ఆర్ ఆర్ ఆర్ అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంటున్న వేళ్ళ నిర్మాత దానయ్య ఊసేలేదు. దర్శకుడు రాజమౌళి కావాలనే దానయ్యను సైడ్ చేశారనే వాదన వినిపిస్తోంది.
సినిమా అనే సౌధానికి ప్రధాన పిల్లర్ నిర్మాత. దర్శకుడి సృజనకు, నటుల వ్యక్తీకరణకు దృశ్యరూపం ఇవ్వాలంటే డబ్బులు కావాలి. అవి సమకూర్చే వ్యక్తి నిర్మాత మాత్రమే. ఒక సినిమా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ లో నిర్మాతకు భాగం, బాధ్యత ఉంటాయి. అలాంటి నిర్మాతను రాజమౌళి పక్కన పెట్టేశాడు. కనీసం పట్టించుకోవడం మానేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంటున్న వేళ నిర్మాత దానయ్య ఊసేలేదు. ఆర్ ఆర్ ఆర్ అంటే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి... ఈ నాలుగు పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఎం ఎం కీరవాణి ప్రఖ్యాత సినిమా వేదికపై అందరికీ క్రెడిట్ ఇచ్చారు. ఒక్క నిర్మాత దానయ్యకు తప్ప. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, చంద్రబోస్.. అందరి పేర్లు పలికారు. నిర్మాత దానయ్య పేరు గోల్డెన్ గ్లోబ్ వేదికపై ప్రస్తావించలేదు. ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్ టీమ్... అక్కడ కూడా దానయ్యకు క్రెడిట్ ఇవ్వలేదు.
అసలు ఆర్ ఆర్ ఆర్ నిర్మాత గురించి యూనిట్ లో ఒక్కరు కూడా మాట్లాడకపోవడం వెనుక బలమైన కారణమైతే ఉంది. రాజమౌళితో దానయ్యకు ఎక్కడో చెడింది. ప్రచారంలో ఉన్న వాదన ప్రకారం... ఆర్ ఆర్ ఆర్ ని ఆస్కార్ వరకూ తీసుకెళ్లేందుకు ఏడెనిమిది నెలలుగా అమెరికాలో క్యాంపైన్ చేస్తున్నారు. దీని కోసం కోట్లు వెచ్చించి పీఆర్ సంస్థలను నియమించుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పెద్ద మొత్తంలో ప్రమోట్ చేసి ఆస్కార్ జ్యూరీ మెంబర్స్ దృష్టిలో పడేలా చేయడానికి రూ. 50 కోట్లకు పైగా ఖర్చయినట్లు సమాచారం.
ఈ డబ్బులు దానయ్య సమకూర్చని కారణంగా రాజమౌళి స్వయంగా భరించారట. లేదా మరొక నిర్మాత భరించేలా చేశారట. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి నిర్మాత దానయ్య అయినప్పటికీ దానికి ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చింది మేము. మా కృషితోనే ఆర్ ఆర్ ఆర్ ఈ స్థాయిలో నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్ వరకూ వెళ్ళింది. ఈ విషయంలో సహకారం అందించని దానయ్యకు క్రెడిట్ ఇచ్చేది లేదని ఆర్ ఆర్ ఆర్ టీమ్ భావించి ఉంచొచ్చు. దానయ్య పేరు ప్రస్తావించకూడదని నిర్ణయించుకున్న నేపథ్యంలో రాజమౌళితో పాటు ఎవరూ... మాట్లాటం లేదని ఒక వాదన.
రేపు నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచినా దానయ్యకు మాత్రం క్రెడిట్ ఇవ్వరు. ఇటువైపు దానయ్య కూడా సైలెంట్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి వస్తున్న అంతర్జాతీయ అవార్డ్స్ పై ఆయన మౌనం వహిస్తున్నారు. మీడియాతో మాట్లాడటం కాదు కదా కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించడం లేదు. ఆయనకు ఆర్ ఆర్ ఆర్ తో అసలు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు.
కారణాలు ఏవైనా దానయ్యను మరవడం హర్షణీయం కాదు. ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా పెద్ద అయోమయం నెలకొంది. అనుకున్న సమయానికి మూవీ పూర్తి కాలేదు. బడ్జెట్ పెరిగిపోయింది. మరో ప్రక్క బయ్యర్ల నుండి ఒత్తిడి. ఒకటికి మూడు సార్లు విడుదల వాయిదా... ఇలా నానా తంటాలు పడి మూవీ కంప్లీట్ చేసి విడుదల చేశారు. ఆర్ ఆర్ ఆర్ టెన్షన్స్ తో దానయ్య అనారోగ్యానికి కూడా గురయ్యారు. ఇన్ని వ్యయప్రయాసలు పడి సినిమా తీస్తే చిన్న చిన్న కారణాలకు ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా చేశారు.
