K Viswanth: ఆ చిత్ర కథ ఎందుకు రాశానా అని బాధపడిన కే విశ్వనాథ్!
చిత్ర రాజం సిరివెన్నెల విషయంలో ఆయన మానసిక సంఘర్షణకు గురయ్యారట. ఆయన రాసుకున్న పాత్రలు ఎక్కడో ఆయనకే నచ్చలేదట

కే విశ్వనాథ్ కథలు గొప్పగా ఉంటాయి. పాత్రలు లోతైన భావాలు పలికిస్తాయి. భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం విశ్వనాథ్ తెలిసిన గొప్ప విద్య. హీరో, హీరోయిన్ పాత్రలు వైరుధ్యంగా రాసుకోవడం విశ్వనాథ్ కథా శైలిలో ఒకటి. విశ్వనాథ్ ని దిగ్దర్శకుడిగా తీర్చిదిద్దింది కూడా ఆయన కథలే. అయితే ఓ మూవీ కథ ఆయనను తీవ్ర సంఘర్షణకు గురి చేసిందట. అదే సిరివెన్నెల చిత్ర కథ.
1986లో విడుదలైన సిరివెన్నెల టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై చాటిన చిత్రమది. గుడ్డివాడైన హీరో, మూగదైన హీరో మధ్య నడిచే రొమాంటిక్ డ్రామా. సుహాసిని, బెంగాలీ నటుడు డి బెనర్జీ ప్రధాన పాత్రలు చేశారు. కేవీ మహదేవన్ అందించిన పాటలు అజరామరం. ఈ సినిమాతో సీతారామశాస్త్రి రచయితగా పరిచయమయ్యారు.
తెలుగు సినిమా పూర్తిగా కమర్షియల్ రూపందాల్చి కథం తొక్కుతున్న రోజుల్లో... గుడ్డి హీరో, మూగ హీరోయిన్ అంటే ఎవరైనా చూస్తారా చెప్పండి. కే విశ్వనాథ్ సినిమాలు సమకాలీన చిత్రాలకు భిన్నంగా ఉండేవి. సునామీలో ఆయన కళాత్మక చిత్రాలు ఎదురీదాయి. ప్రేక్షకుల్లో దాగున్న కళాతృష్ణను నిద్రలేపాయి. సున్నితమైన భావాల మధ్య రెండున్నర గంటల పాటు భావోద్వేగాలతో సినిమా నడిపించి విశ్వనాథ్ విజయం సాధించారు.
చిత్ర రాజం సిరివెన్నెల విషయంలో ఆయన మానసిక సంఘర్షణకు గురయ్యారట. ఆయన రాసుకున్న పాత్రలు ఎక్కడో ఆయనకే నచ్చలేదట. గుడ్డివాడైన హీరోని మూగ హీరోయిన్ ప్రేమిచడమేంటి? ఈ కథ రాయాలనే ఆలోచన నాకు ఎందుకు వచ్చింది? అసలు ఈ సినిమా పూర్తి చేయగలనా ? ఎలా ముగించాలనే మానసిక యుద్దానికి గురయ్యారట. ఏదైతేనేమి పట్టుదలగా మూవీ పూర్తి చేశారు.1986 జూన్ 5న విడుదలైన సిరివెన్నెల విశ్వనాథ్ ఆలోచనల నుండి జాలువారిన కళాఖండంగా నిలిచిపోయింది.