'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో 'సాహో' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాను ఎంత భారీ బడ్జెట్ తో తీసినా.. దానికి ప్రమోషన్స్ అనేవి కీలకం. కానీ 'సాహో' విషయంలో ఆ పార్ట్ చాలా వీక్ గా ఉందనిపిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించి యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు.

ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడం కోసం బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకొచ్చారు. ప్రచారం కోసం కూడా బాలీవుడ్ యూనిట్ మీద ఆధారపడ్డారు. వారు ఫాలో అయ్యే స్ట్రాటజీలనే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. అయితే అది తెలుగు ప్రేక్షకులకు చేరుతున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి సరైన స్టిల్స్ లేవు.

మరో నలభై రోజుల్లో రిలీజ్ పెట్టుకొని సరైన బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. పబ్లిసిటీను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. టీజర్ రిలీజ్ చేసిన రోజు రెండు రోజులు హడావిడి నడిచింది. ఆ తరువాత మళ్లీ ఏం లేదు. ఇప్పుడు మళ్లీ పాట రిలీజ్ అన్నారు. దానికి సంబంధించిన టీజర్ తెలుగు వారికి పెద్దగా కనెక్ట్ అయినట్లు లేదు. కేవలం సినిమా టైటిల్, ప్రభాస్, భారీతనం మీద సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయేమో కానీ లాంగ్ రన్ అది కష్టమవుతుంది.

తెలుగులో ఈ సినిమాకు రావాల్సిన వసూళ్లు తక్కువేమీ కాదు.. బాహుబలి పార్ట్ 1కు మించి రావాలి. కానీ నిర్మాణ సంస్థ ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. అంటే.. ఓ రేంజ్ లో ప్రచారాలు చేయాల్సివుంటుంది. మరి ఇప్పటికైనా మేలుకొని సినిమాపై సరైన బజ్ క్రియేట్ చేస్తారేమో చూడాలి!