బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్'. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే ఈ సినిమా యాభై కోట్లు వసూలు చేసిందని బాక్సాఫీస్ రిపోర్ట్ చెబుతోంది.

మొదటి నుండి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మొదటిరోజు ఈ సినిమా కనీసం రూ.55 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు. అంత వసూలు కానప్పటికీ రూ.50 కోట్లు రాబట్టి హృతిక్, టైగర్ కెరీర్లలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వాణీ కపూర్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాతో పాటు 'సైరా నరసింహారెడ్డి' వంటి భారీ సినిమా విడుదలైనప్పటికీ 'వార్' యాభై కోట్లు రాబట్టడం విశేషమనే చెప్పాలి.  యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సినిమాను ఆదిత్య చోప్రా తెరకెక్కించారు.

సినిమాకి మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తుంటే పెట్టిన బడ్జెట్ మూడు రోజుల్లోనే కలెక్షన్ల రూపంలో వచ్చేస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి చాలా కాలం తరువాత టైగర్ ష్రాఫ్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ ఏడాది 'సూపర్ 30'తో సక్సెస్ అందుకున్న హృతిక్ ఇప్పుడు మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.