విక్రమ్ మూవీతో మరపురాని విజయాన్ని అందుకున్నారు కమల్ హాసన్. ఈ సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన కమల్, కొందరికి అరుదైన బహుమతులు ఇస్తున్నారు.   

విక్రమ్ (Vikram Movie) డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కి నిన్న కమల్ హాసన్ ఖరీదైన లక్సస్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. కమల్ హాసన్ ఇచ్చిన బహుమతికి లోకేష్ కనకరాజ్ ఎంతగానో మురిసిపోయారు. సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కాగా నేడు కమల్ హీరో సూర్యకు ఖరీదైన బహుమతి ఇచ్చారు. గడియారాల్లో లగ్జరీ బ్రాండ్ గా ఉన్న రోలెక్స్ వాచ్ (Rolex Watch) ని సూర్యకు గిఫ్ట్ గా తెచ్చారు. కమల్ హాసన్ స్వయంగా సూర్య చేతికి రోలెక్స్ వాచ్ అలంకరించారు. కమల్ హాసన్ తో పాటు లోకేష్ కనకరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

విక్రమ్ మూవీలో సూర్య రోలెక్స్ పేరుతో చిన్న గెస్ట్ రోల్ చేశారు. విక్రమ్ చేత నాశనం చేయబడ్డ డ్రగ్ మాఫియా సామ్రాజ్యానికి అధిపతిగా సూర్య కనిపించారు. రోలెక్స్ పాత్ర చేసినందుకు సూర్య ఒక్క రూపాయికి కూడా ఛార్జ్ చేయలేదట. కమల్ హాసన్ (Kamal haasan) మూవీ కావడంతో ఫ్రీగా డేట్స్ ఇచ్చారట. విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ నేపథ్యంలో కమల్ హాసన్ హీరో సూర్యకు రోలెక్స్ వాచ్ ఇవ్వడం జరిగింది. 

Scroll to load tweet…

ఇక కమల్ బహుమతిపై సూర్య (Suriya) స్పందించారు. అన్నయ్య కమల్ బహుమతి ఇచ్చిన ఈ క్షణాలు జీవితాన్ని అందంగా మార్చేశాయంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. విక్రమ్ తో వచ్చిన లాభాలను కమల్ హాసన్ ఈ విధంగా బహుమతుల రూపంలో ఇచ్చేస్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కమల్ నిస్వార్ధ బుద్ధిని కొనియాడుతున్నారు. విక్రమ్ నిర్మాతగా కమల్ ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఆయనకు భారీ లాభాలు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. 

సరైన కమర్షియల్ ఎంటర్టైనర్ పడితే తన్నెవరూ ఆపలేరని కమల్ నిరూపించాడు. బ్లాక్ బస్టర్స్  కొట్టే సత్తా ఇంకా ఉందంటూ నిరూపించారు. కేవలం ఐదు రోజుల్లో రూ. 200 కోట్ల వసూళ్లు సాధించిన విక్రమ్.. రన్ ముగిసే నాటికి రూ. 400 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం కలదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. విడుదలైన అన్ని భాషల్లో విక్రమ్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. 

ఓవర్సీస్ లో కూడా విక్రమ్ ది అదే జోరు. యూఎస్ లో ఇప్పటికే $2 మిల్లియన్ వసూళ్లను దాటేసింది. విక్రమ్ తెలుగు రిలీజ్ హక్కులను హీరో నితిన్ కేవలం రూ. 7 కోట్లకు సొంతం చేసుకున్నారు. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి చేరుకున్న ఈ మూవీ లాభాల వైపుగా దూసుకెళుతుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో విక్రమ్ సాలిడ్ వసూళ్లు సాధిస్తుంది. ఏపీ/తెలంగాణలలో వీక్ డేస్ లో కూడా విక్రమ్ కి ప్రేక్షకులు పోటెత్తుతున్నారు.