లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నారు. దీనితో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం విజయశాంతి రీఎంట్రీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సరిలేరు నీకెవ్వరు చిత్రం కంటే ముందుగానే ఓ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం విజయశాంతికి వచ్చిందట. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కీలకమైన పాత్ర కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా విజయశాంతిని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పేరు ప్రస్తావించకుండా విజయశాంతి ఈ విషయాన్ని తెలిపారు. ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని కానీ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఆ చిత్రాన్ని అంగీకరించలేదని విజయశాంతి గతంలో తెలిపారు. 

మరికొందరి వాదన ప్రకారం మహేష్ సినిమాలో నటించేందుకే విజయశాంతి అల్లు అర్జున్ సినిమాని రిజెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. దీనితో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ పాత్రలోకి సీనియర్ హీరోయిన్ టబుని ఎంపిక చేసుకున్నారు. సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నాననే ఊహాగానాలని విజయశాంతి కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. 

త్వరలో సరిలేరు నీకెవ్వరు చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపిస్తాడు. రష్మిక మందన హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.