తెలుగులో స్టార్‌ హీరోలు హోస్టులుగా వ్యవహరించడమనేది చాలా తక్కువ. `మీలో ఎవరు కోటీశ్వరుడు`, `బిగ్‌బాస్‌ 4` కి తప్ప మరేషోకి హీరోలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించలేదు. తాజాగా సమంత `ఆహా` ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ కోసం `సామ్‌జామ్‌` టాక్‌ షోకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికిగానూ ఆమె భారీగానే పుచ్చుకుంటోంది. 

ఇక ఇప్పుడు రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ కూడా హోస్ట్ గా మారబోతున్నాడట. ఇండియాలో పాపులర్‌ హిప్‌ హాప్‌ డాన్స్ షో `బ్రీజర్‌ వివిడ్‌ షఫుల్‌ సీజన్‌4`కి విజయ్‌ దేవరకొండతోపాటు మహేష్‌ హీరోయిన్‌ కృతిసనన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారని తెలుస్తుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన టాలెంటెడ్‌ వీధి డాన్సర్లను వెలికితీయడమే ఈ షో ముఖ్య ఉద్దేశ్యం. 

ఈసారి డాన్స్ తోపాటు ఆర్ట్, మ్యూజిక్‌ వంటి వివిధ కళారూపాల్లో కూడా పోటీలుంటాయని తెలుస్తుంది. డిసెంబర్‌ 21వరకు ఆన్‌లైన్‌ అప్లికేషన్స్ ఉంటాయని, జనవరి 17 నుంచి ఆడిషన్స్ జరుగుతుందని సమాచారం. అలాగే విజేతలకు 20లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారట. `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో విశేషమైన క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌ దేవరకొండ హోస్ట్ గా షో అంటే దానికి ప్రత్యేకమైన క్రేజ్‌ వస్తుందని చెప్పొచ్చు.