సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తరువాత హీరోగా మారాడు విజయ్ ఆంటోనీ. తమిళంలో అతడి నటించిన సినిమాలు ఆరంభంలో వరుస హిట్స్ అందుకున్నాయి. తెలుగులో కూడా ఆ సినిమా విడుదలై సక్సెస్ అందుకున్నాయి.

ముఖ్యంగా 'బిచ్చగాడు' సినిమాకు చక్కటి ప్రేక్షకాదరణ దక్కింది. అయితే ఈ సినిమాతో వచ్చిన మార్కెట్ ని ఎక్కువరోజులు నిలబెట్టుకోలేకపోయాడు విజయ్. ఆయన నటించిన సినిమాలన్నీ ఈ మధ్య కాలంలో ఫ్లాప్ లుగా మిగిలాయి. దీంతో అతడి సినిమాలపై జనాలకు ఆసక్తి తగ్గిపోయింది.

అయినప్పటికీ తన సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా అతడు నటించిన 'కిల్లర్' సినిమా తెలుగులో రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన తదుపరి సినిమాల గురించి మాట్లాడారు. అరుణ్ విజయ్ తో కలిసి 'జ్వాల' అనే ద్విభాషా చిత్రంతో పాటు, ఆనంద్, సెంథిల్ అనే ఇద్దరు కొత్త దర్శకులతో కలిసి సినిమాలు చేయబోతున్నట్లు చెప్పారు. 

ఇవి కాకుండా మరో పది సినిమాలు అంగీకరించినట్లు సమాచారం. ఇవన్నీ మూడు, నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అన్నారు. ఇంతకముందు తన సొంత బ్యానర్ లోనే సినిమా చేశానని, ఇప్పుడు బయట నిర్మాతలతో ఎక్కువగా సినిమాలు కమిట్ అవుతున్నట్లు చెప్పారు.