సోమవారం ఉదయం ప్రముఖ తెలుగు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వి. దొరస్వామి రాజు గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు సినీ వర్గాలు, సీఎం కేసీఆర్‌ ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

`వరదరాజు దొరస్వామి రాజు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. పంపిణీ దారుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి అంచెలంచెలుగా నిర్మాతగా ఎదిగిన వారి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమైనది. సినీ నిర్మాతగా విలువలతో కూడిన అనేక కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన ఆయన సినీ ప్రయాణం ఉన్నతమైనది. `సీతారామయ్య గారి మనవరాలు`, `మాధవయ్యగారి మనవడు`, `ప్రెసిడెంట్‌గారి పెళ్లాం` లాంటి కుటుంబ కథా చిత్రాలతోపాటు `అన్నమయ్య`, `వెంగమాంబ` లాంటి భక్తి రస చిత్రాల ద్వారా తెలుగు ప్రజలు హృదయాల్లో చిరయశస్సును సంపాదించుకున్నారు. 

నగరి ఎమ్మెల్యేగా, తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యునిగా దొరస్వామిరాజు అందించిన సేవలు అనుపమానమైనవి. తెలుగు సినిమా పరిశ్రమలో, రాజకీయ రంగంలో అజాతశత్రువుగా అందరి అభిమానాన్ని చూరగొన్న దొరస్వామి రాజుగారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా` అని అన్నారు వెంకయ్య నాయుడు. ఇదిలా ఉంటే దొరస్వామి రాజు భౌతిక కాయానికి నేడు(మంగళవారం) ఫిల్మ్ నగర్‌లోని మహాప్రసాన్థంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.