రెండేళ్ళ క్రితం వచ్చిన `ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌`(ఎఫ్‌2) ఊహించని విధంగా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా అలరించారు. అనిల్‌ రావిపూడి తనదైన కామెడీతో మ్యాజిక్‌ చేశాడు. దీంతో ఇది సంక్రాంతి కానుకగా విడుదలై వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. తాజాగా రెట్టింపు ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌తో మరో సినిమా రాబోతుంది. 

`ఎఫ్‌2`కి సీక్వెల్‌గా `ఎఫ్‌3`ని రూపొందించబోతున్నట్టు ఇటీవల వెంకీ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు. తాజాగా గురువారం ఈ సినిమాని ప్రారంభించారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈ చిత్ర ఓపెనింగ్‌ జరిగింది.  అల్లు అరవింద్‌ హీరోహీరోయిన్లు వరుణ్‌ తేజ్‌, తమన్నాలపై క్లాప్‌ నిచ్చారు. ఈ కార్యక్రమంలో వరుణ్‌ తేజ్‌, తమన్నాలతోపాటు దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు. 

ఈ చిత్రాన్ని దిల్‌రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మరి ఇందులో మరో హీరో ఉంటారా? లేక వెంకీ, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌లతోనే తెరకెక్కిస్తారా? అన్నది సస్పెన్స్ నెలకొంది. గతంలో మరో హీరో నటిస్తారనే టాక్‌ వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి డబ్బు తో వచ్చే ఫన్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది.