ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. 36 ఏళ్ళ వస్సులోనే మృత్యువు ఓ డాన్సర్ ప్రాణాలను హరించింది. రోడ్డు పక్కన ఆగిఉన్న కారుకు యాక్సిడెంట్ అవ్వడంతో డ్యాన్సర్ సుధీంద్ర దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదంలో డ్యాన్సర్ మరణం
ఈమధ్య రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఏపీ తెలంగాణ లో జరిగిన రోడ్డు ప్రమాదాల షాక్ నుంచి తేరుకోకముందే.. బెంగళూరు సమీపంలో మరో రోడ్డు ప్రమాదం ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నింపింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో టెలివిజన్ రియాల్టీ షో డ్యాన్సర్ సుధీంద్ర (36) దుర్మరణం చెందాడు. కొత్తగా కొనుగోలు చేసిన కారులో సమస్య తలెత్తడంతో.. నేలమంగళ తాలూకా పెమ్మనిహళ్లి వద్ద జాతీయ రహదారి పక్కన కారు ఆపి పరిశీలిస్తుండగా, వెనుకనుంచి వచ్చిన ట్రక్కు అతడిని బలంగా ఢీకొట్టింది.
కొత్త కారు కొన్న సంతోషంలో..
డ్యాన్సర్ సుధీంద్ర నవంబర్ 3న సోమవారం మారుతి సుజుకి ఈకో కారును కొనుగోలు చేశాడు. ఆ కారును తన సొంత ఊరైన బెంగళూరు గ్రామీణ జిల్లాలోని త్యామగోండ్లలో సోదరుడు రాఘవేంద్రకు చూపించేందుకు వెళ్లాడు. అక్కడ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి.. తిరిగి వస్తుండగా.. వాహనంలో ఏదో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో కారును రోడ్డుపక్కన ఆపి చెక్ చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ ట్రక్కు కారు పక్కన నిలబడి ఉన్న సుధీంద్రను బలంగా తాకింది. దాంతో రెండు వాహనాల మధ్య అతను నలిగిపోవడంతో పాటు.. ట్రక్కు వెనుక చక్రం అతడి శరీరంపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. సంఘటన స్థలంలో రక్తపు మడుగులో పడి ఉన్న సుధీంద్రను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తు వల్లే..
ప్రమాదం జరగడంతో .. ట్రక్కు ఆపి, కిందరకు దిగిన డ్రైవర్..పరిస్థితి చూసి భయంతో పరారాయ్యాడు. సమాచారం అందుకున్న దెబాస్‌పేట పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసింది. కొద్ది గంటల్లోనే ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడిపినట్లు తెలిపారు. ఈ అంశంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద వార్త తెలిసి సుధీంద్ర కుటుంబంతో పాటు, ఇండస్ట్రీలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. సుధీంద్ర పలు టీవీ రియాల్టీ షోలలో డ్యాన్సర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొత్త కారు కొన్న రెండో రోజే అతడు ఇలా మరణించడంతో.. ఈ విషయం.. అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
