2002లో నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రైటర్ త్రివిక్రమ్ మూడేళ్లకు సూపర్ స్టార్ మహేష్ తో అతడు మూవీ చేశారు. కామెడీ. లవ్, యాక్షన్ మరియు ఎమోషన్స్ అన్నీ కలగలిపి త్రివిక్రమ్ పక్కా ఎంటర్టైనర్ తెరకెక్కించారు. 2005 ఆగస్టు 10న విడుదలైన అతడు 15ఏళ్ళు పూర్తి చేసుకుంది. మహేష్ కెరీర్ బెస్ట్ చిత్రాలలో ఒకటిగా ఉన్న అతడు మూవీకి వెండి తెరపై చెప్పుకోదగ్గ ఆదరణ దక్కలేదు. ఆ సినిమా స్థాయికి అతి పెద్ద బ్లాక్ బస్టర్ నమోదు చేయాలి. కానీ త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ ఏమిటో అర్థం అయ్యేలోపే ఈ మూవీ థియేటర్స్ నుండి పర్వాలేదు అనే టాక్ తో వెళ్ళిపోయింది. ఈ మూవీలోని అసలువిషయం, త్రివిక్రమ్ కామెడీ పంచ్ సత్తా బుల్లితెరపై ప్రసారమయ్యాక తెలిసింది. అతడు మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా అనేక పర్యాయాలు ఈ చిత్రాన్ని ప్రసారం చేయడం జరిగింది. 
 
ప్రతిసారి అత్యధిక టీఆర్పీ రేటు దక్కించుకునే ఈ చిత్రం స్టార్ మా కు బంగారు గనిలా దొరికింది. ఈ సినిమా ఎన్నిసార్లు ప్రసారం అయినా ఆ రోజు అతడు మాత్రమే చూసే ప్రేక్షకులు అనేక మంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అతడు మూవీకి చాలా మంది ఆడియన్స్ అడిక్ట్ అయ్యారు. ముఖ్యంగా విలేజ్ లో ఓ ఉమ్మడి కుటుంబంలో జరిగే ఫ్యామిలీ డ్రామా మూవీకి హైలెట్ అనాలి. ఇక బ్రహ్మాండం కామెడీ గురించి వర్ణించడానికి పదాలు దొరకవు. మహేష్ క్యారెక్టరైజేషన్ కూడా దర్శకుడు త్రివిక్రమ్ కొత్తగా తెరకెక్కించారు. త్రిషా నటన ఈ మూవీలో చెప్పుదగ్గ మరో అంశం, మణిశర్మ పాటలు అధ్బుతం. 
 
ఈ మూవీతో దర్శకుడిగా స్థిరపడిన త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో చేసే అవకాశం దక్కించుకున్నాడు. అతడు సినిమాతో కెరీర్ కి మంచి పునాది వేసుకున్న ఆయన, జల్సా మూవీతో మంచి హిట్ కొట్టి స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. ఇప్పుడు త్రివిక్రమ్ టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకొనే దర్శకులలో ఒకరు. మహేష్ కి సైతం ఒక్కడు తరువాత సరైన బ్రేక్ లేక ఇబ్బందిపడుతున్న తరుణంలో అతడు మూవీ ఊరటను ఇచ్చింది. ఈ మూవీ తరువాత మహేష్ చేసిన పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.