నందమూరి తారకరత్న (Taraka Ratna) కొద్దిసేపటి కింద కన్నుమూశారు. ఆయన అకాల మరణం పట్ల సినీ తారలు, ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్, చంద్రబాబు నాయుడు, హరీశ్ రావు, రవితేజ, అల్లరి నరేష్ లు ఈ సందర్భంగా సంతాపాలు ప్రకటించారు.
22 రోజుల పాటు ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడిన నందమూరి తారకరత్న (Taraka Ratna) కొద్ది సేపటి కింద తుదిశ్వాస విడిచారు. అతి చిన్నవయస్సులోనే అకాల మరణం చెందడం పట్ల సినీ తారలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజ, అల్లరి నరేష్, నాగ శౌర్య, స్మిత, దర్శకుడు అనిల్ రావిపూడి, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా వేదికన సంతాపాలు ప్రకటించారు. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.
తారకరత్న మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే మరణించడం పట్ల సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ట్వీట్ చేస్తూ.. ‘తారకరత్న మరణం గురించి తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. నందమూరి తారకరత్నది విషాదకరమైన అకాల మరణం. ప్రకాశవంతమైన, ప్రతిభావంతులైన, ఆప్యాయతగల యువకుడైన తారకరత్న చాలా త్వరగా వెళ్లిపోయాడు! ఈ భాదాకర సమయంలో కుటుంబ సభ్యులు, అభిమానులందరికీ నా సానుభూతి! అతని ఆత్మకు శాంతి కలుగుగాక! శివైక్యం’ అంటూ భావోద్వేగంగా సంతాపం ప్రకటించారు.
నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోరుకున్నారు. ఆయన మరణం పట్ల ప్రకటన విడుదల చేశారు.
‘నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. ఆయన భార్యాబిడ్డలకి, తండ్రి శ్రీ మోహనకృష్ణకు, బాబాయి బాలకృష్ణకు, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాన’న్నారు.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయకుడు (Chandrababu Naidu) తారకరత్న మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ‘నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.’అని ట్వీట్ ద్వారా భావోద్వేగమయ్యారు.
మరోవైపు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు (T.Harish Rao) కూడా తారకరత్న మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ‘సినీనటుడు నందమూరి తారకరత్న మరణవార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నాను. అతని ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ అంటూ ట్వీటర్ ద్వారా సంతాపం తెలిపారు.
తారకరత్న మరణవార్త తెలుసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) విచారం వ్యక్తం చేశారు. ‘నందమూరి తారకరత్న అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలా త్వరగా వెళ్లిపోయారు సోదరా... ఈ దుఃఖ సమయంలో కుటుంబం, ప్రియమైన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
టాలీవుడ్ సీనియర్ నటుడు రవితేజ (Ravi Teja) కూడా తారకరత్న మరణవార్తపై భావోద్వేగంగా స్పందించారు. ‘ఎంతో పోరాడిన ప్రియతమ తారకరత్న విషాదకరమైన మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను! ప్రతి ఒక్కరి పట్ల ఆయన దయగల స్వభావం కోసం అతను ఎల్లప్పుడూ ప్రేమగా గుర్తుంచుకుంటాడు! ఆయన ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేస్తూ సంతాపం ప్రకటించారు.
హీరో అల్లరి నరేష్ (Allari Naresh) తారకరత్న అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘ప్రియమైన స్నేహితుడు, చాలా వినయపూర్వకమైన వ్యక్తి, అతను ఇంత త్వరగా వెళ్లిపోయినందుకు హృదయ విదారకంగా ఉంది. అతన్ని చాలా మిస్ అవున్నాను. తారకరత్న బాబాయి ప్రశాంతంగా ఉండండి.’ అని ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. అలాగే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
యంగ్ హీరోలు నాగశౌర్య, శ్రీవిష్ణు, సింగర్ స్మిత, యువ దర్శకులు అనిల్ రావిపూడి, ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట, ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ట్వీటర్ ద్వారా తమ సంతాపాలను ప్రకటించారు. ఇక తారకరత్న గతనెల 27న టీడీపీ యువనేత లోకేష్ ఆధ్వర్యంలో ప్రారంభించిన కుప్పం ‘యువగళం’ పాదయాత్రలో గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఇటీవలే సినిమాలతో పాటు రాజకీయంగానూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు తారకరత్నం. ఈ క్రమంలో అకాల మరణంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
