టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో చెప్పేందుకు ఇది నిదర్శనం. బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో రెండు టాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి.
గత ఏడాది బాలీవుడ్ ని సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ షేక్ చేశాయి. ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2 బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. అదే సమయంలో అక్కడి టాప్ స్టార్స్ చిత్రాలు చతికలపడ్డాయి. ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2తో పాటు కార్తికేయ 2, కాంతార, సీతారామం చిత్రాలు నార్త్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టున్నాయి. నిఖిల్, రిషబ్ శెట్టి లాంటి టైర్ టూ హీరోలు కూడా అక్కడి హీరోలకు పోటీ ఇస్తున్నారు.
సౌత్ చిత్రాలపై ముఖ్యంగా టాలీవుడ్ సినిమాల మీద నార్త్ ఆడియన్స్ కి ఏ రేంజ్ హైప్ ఉందో తాజా సర్వే తేల్చేసింది. ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ అవైటెడ్ టాప్ ఫైవ్ హిందీ చిత్రాల లిస్ట్ లో రెండు టాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. పుష్ప 2, సలార్ హిందీ వెర్షన్స్ కోసం అక్కడి ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారట. పుష్ప 2 ఏకంగా టాప్ పొజిషన్ లో ఉంది. తర్వాత స్థానంలో హీరా పేరి 3 ఉంది. ఇక మూడో స్థానంలో ప్రభాస్ సలార్ ఉంది. తర్వాత టైగర్ 3, భూల్ బులియా 3 చిత్రాలు ఉన్నాయి.
ఈ లిస్ట్ లో షారుక్ ఖాన్ జవాన్ లేకపోవడం విశేషం. అదే సమయంలో ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న దేవర, గేమ్ ఛేంజర్ కి కూడా చోటు దక్కలేదు. చూస్తుంటే టాలీవుడ్ నుండి నిజమైన పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్ మాత్రమే అనిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ హీరోలకు ఇంకా పాన్ ఇండియా గుర్తింపు రాలేదనే సందేహం కలుగుతుంది. ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ మొత్తం రాజమౌళి కొట్టేయగా ఎన్టీఆర్, చరణ్ సోలోగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పుడే వారు రియల్ పాన్ ఇండియా స్టార్స్ అవుతారని చెప్పొచ్చు.
ఇటీవల నటుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కి ఎక్కడలేని ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో నంబర్ వన్ హీరో అంటే అల్లు అర్జునే అన్నాడు. తర్వాత ప్రభాస్, ఎన్టీఆర్ లకు క్రేజ్ ఉందని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ కి యూపీ, బీహార్, నేపాల్ లో కూడా అభిమానులు ఉన్నారన్నారు.
