సల్మాన్‌ఖాన్‌ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రాధే’. దిశా పటానీ హీరోయిన్. రణదీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌, మేఘా ఆకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర టీమ్ ఖరారు చేసింది. ఈ ఏడాది ఈద్‌ సందర్భంగా మే 13న ‘రాధే’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అటు థియేటర్లలో, ఇటు ఆన్ లైన్లో ఒకేసారి విడుదలవుతోంది.

అయితే దేశంలో ఎక్కడా థియేటర్లు తెరిచిలేవు. అందుకే, ఈ సినిమాకి కలెక్షన్లు ఏమి ఉండవు అని ముందే చెప్పేస్తున్నాడు సల్మాన్ ఖాన్.“ఎక్కడో కొన్ని చోట్ల థియేటర్లు తెరిచి ఉన్నాయి. తెరిచిన చోట కూడా జనం థియేటర్ కి వస్తారని అనుకోను. పూర్తిగా ఆన్ లైన్ పైనే ఆధారపద్దామనేది వాస్తవమే. ఇది రిస్క్ అని తెలుసు. కానీ తప్పదు. ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు అడుగు ముందుకెయ్యాలి. నష్టం అని తెలిసి విడుదల చేస్తున్నాం. చూద్దాం అవుతుందో,” అంటూ  చెప్పాడు సల్మాన్ ఖాన్.

వాస్తవానికి ఇప్పుడు జనం ఉన్న మూడ్ లో ఈ సినిమాకి ఆన్ లైన్ లో కూడా పెద్దగా వసూళ్లు రాకపోవచ్చనే క్లారిటీ సల్మాన్ కి ఉంది. ఈ నష్టాన్ని వేరే విధంగా భర్తీ చేస్తాడట నిర్మాతలకు. అందుకే … వాళ్ళు రిస్క్ చేసి జీ ప్లెక్స్ లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ టైమ్ లో కాస్త జనాలకు ఉత్సాహం కలిగించటానికి ఈ పనిచేస్తున్నట్లు గా చెప్పుకొస్తున్నాడు.

మొదట అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం గతేడాది మే 22న  ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చింది. సౌత్‌ కొరియన్‌ చిత్రం ‘వెటరన్‌’కు రీమేక్‌గా ‘రాధే’ తెరకెక్కుతోంది. సాజిద్‌వాజిద్‌, దేవిశ్రీ ప్రసాద్‌, హిమేశ్‌ రేష్మియాలు సంగీతం సమకూర్చుతుండగా, రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సోహాలి ఖాన్‌ ప్రొడక్షన్స్‌, సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది.