ఇటీవల సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. తాజాగా హీరోయిన్ మూవీ రిలీజ్ కాబోతుంది. సమంత నటించిన `ఓ బేబీ` మళ్లీ థియేటర్లోకి వస్తుంది.
సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం `ఓ బేబీ`. ఆమెకి సక్సెస్ ని తెచ్చిపెట్టిన చిత్రం. అంతకు ముందు `యూటర్న్` చిత్రం చేసినా అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి రూపొందించిన `ఓ బేబీ` పెద్ద విజయం సాధించింది. సమంత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించగలదనే నమ్మకాన్ని,ధైర్యాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే.
సమంత మెయిన్ లీడ్‌గా, నాగశౌర్య, తేజ సజ్జ, లక్ష్మి, రాజేంద్రపసాద్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నందినిరెడ్డి దర్శకత్వం వహించగా, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. 2019 జులై 5న ఈ చిత్రం విడుదలై మెప్పించింది. ఇందులో సమంత నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సుమారు నలభై కోట్ల వరకు కలెక్షన్లని సాధించింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రం మరోసారి రిలీజ్ కాబోతుంది. ఇటీవల కాలంలో సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ ఊపందుకున్న నేపథ్యంలో `ఓ బేబీ` మరోసారి థియేటర్లోకి రాబోతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని రీరిలీజ్ చేయబోతుంది పీవీఆర్ సినిమా. కేవలం పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లలోనే ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. `స్త్రీల నిజమైన అందం, శక్తిని సెలబ్రేట్ చేసుకోవడానికి `ఓ బేబీ` ని స్క్రీన్‌లపై చూడటం కంటే మెరుగైన మార్గం మరోటి లేదు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీవీఆర్, ఐనాక్స్ స్క్రీన్లలో సినిమా ప్రదర్శించబడుతుంది` అని తెలిపారు.
ఇక `ఓ బేబీ` సినిమా కథ చూస్తే, డెబ్బై ఏళ్ల బామ్మ(లక్ష్మి) వాళ్ల కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లతో జీవిస్తూ ఉంటుంది. బామ్మ ప్రేమ, చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. ఒక దశలో తన మాటలు, చేతల వల్ల కోడలు ఆరోగ్యం పాడవుతుంది. అత్త పెట్టే బాధలు లేకుంటే ఆమె బతుకుతుంది అని డాక్టర్స్ చెప్పడంతో.. సదురు పెద్దావిడా మనవరాలు.. నాన్నమ్మను దుర్భాషలాడి ఇంట్లోంచి వెళ్లేటట్టు చేస్తోంది. ఈ క్రమంలో ఈ పెద్దావిడ ఒక ఫోటో స్టూడియోలో ఒక ఫోటో తీయించుకుంటుంది. అక్కడ జరిగిన మ్యాజిక్‌లో ఆమె అనుకోకుండా పాతికేళ్ల యువతిగా మారిపోతుంది. దీంతో తన చిన్న తనంలో తీర్చుకోలేని కోరికలకు రెక్కలొస్తాయి. ఆమె తాను చేయాలనుకున్న పనులా ఎలా చేసింది, ఈ క్రమంలో చోటుచేసుకునే పరిణామాలే ‘ఓ బేబి’ కథ.
