హీరో సూర్య.. ఇటీవల `ఆకాశం నీ హద్దురా` చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలైనా ప్రశంసలతోపాటు భారీ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సెలబ్రిటీల నుంచి సినిమాకి మంచి స్పందన లభిస్తుంది. సూర్యని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తన జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాపై ఎయిర్‌ డెక్కన్‌ అధినేత గోపీనాథ్‌ సైతం సినిమాని ప్రశంసించారు. 

ఈ సక్సెస్‌ జోష్‌లో సూర్య త్వరలో ఆయన ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట. బాలా దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇది సూర్యతోపాటు ఆర్య, అథర్వ హీరోలుగా రూపొందనుందని టాక్‌. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అన్ని కుదిరితే త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. ఇక సూర్య ఇప్పటికే విశాల్‌, ఆర్యలతో కలిసి `వాడు వీడు`, విక్రమ్‌తో కలిసి `శివపుత్రుడు`, మోహన్‌లాల్‌తో కలిసి `బందోబస్త్` వంటి మల్టీస్టారర్‌ చిత్రాలు చేశారు. అయితే ఈసారి గత చిత్రాలను మించి ఉండబోతుందని టాక్‌. 

బాలా దర్శకత్వంలో సూర్య ఇప్పటికే `నందా`, `శివపుత్రుడు` చిత్రాల్లో నటించాడు. ఇక ప్రస్తుతం సూర్య మణిరత్నం తెరకెక్కిస్తున్న `నవరస` వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. దీనికి గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తొమ్మిది మందిహీరోలు, తొమ్మిది మంది దర్శకులు, నవరసాల్లాంటి తొమ్మిది కథలతో ఈ వెబ్‌ సిరీస్‌ సాగనుంది. అందులో ఒకటి సూర్య చేస్తున్నారు. అంతేకాదు తొమ్మిది మంది సంగీత దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు దీనికి పనిచేస్తుండటం విశేషం. దీంతోపాటు `రాకెట్రీ` చిత్రంలో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు సూర్య.