తెలుగు సినిమా ఇండస్ట్రీలో సురేష్ ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 55 ఏళ్ల అనుభవం ఉన్న ఈ బ్యానర్ పై చిన్నా, పెద్దా అన్ని రకాల చిత్రాలను నిర్మిస్తుంటారు. అయితే ఒక్కోసారి ఈ బ్యానర్ పై చిన్న బడ్జెట్ చిత్రాలను విడుదల చేస్తుంటారు.

అవి ఆడకపోతే గనుక సురేష్ మూవీస్ నుండి ఇలాంటి సినిమానా..? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే సురేష్ బాబు మరో బ్యానర్ ని స్థాపించాలని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

సురేష్ మూవీస్ బ్యానర్ అంటే ఓ పేరుందని, ఈ బ్యానర్ నుండి మంచి సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు జనం ఆశిస్తారని, అలాంటిది ఈ ప్రొడక్షన్ లో బోల్డ్ కంటెంట్, ఇతరత్రా సినిమాలను అనుకోకుండా రిలీజ్ చేసిన సందర్భాలు ఇటీవల గమనించామని.. అందుకే ఇకపై మరో బ్యానర్ పై బయటవాళ్ల సినిమాలను రిలీజ్ చేస్తామని అన్నారు. తాము స్వయంగా తీసే సినిమాలకు మాత్రమే సురేష్ బ్యానర్ ను వాడతామని అన్నారు.

ఇప్పటికే టాలీవుడ్ లో గీతా ఆర్ట్స్, హారిక హాసిని లాంటి సంస్థలు ఇదే విధంగా రెండేసి బ్యానర్లు మొదలుపెట్టాయి. ఒక బ్యానర్ పై పెద్ద సినిమాలు, మరో బ్యానర్ పై చిన్న సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సురేష్ ప్రొడక్షన్స్ కూడా చేరింది.