షూటింగ్ లు మొదలు పెట్టడం కోసం చిరంజీవి  ఇండస్ట్రీ పెద్దలతో కలిసి తెలంగాణా ప్రభుత్వాన్ని కలిసి ఫర్మిషన్స్ సాధించారు. అయితే ఆయన ఆచార్య చిత్రం షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. హైదరాబాద్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవటంతో ఆయన రిస్క్ చేయటం ఇష్టం లేక షూటింగ్ మానుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ చిత్రం షూటింగ్ మొదలైంది. ఆ న్యూస్ తో చిరంజీవి షూటింగ్ న్యూస్ ని కలిపి, చిరు వెనకడుగు..అల్లుడు ముందడగు అంటూ మీడియా రాసుకొస్తోంది. ఇది చిరు అభిమానులకు మండుకొచ్చే విషయం. కళ్యాణ్ దేవ్ గురించి చెప్పేటప్పుడు చిరు షూటింగ్ విషయం ప్రస్దావన ఎందుకంటున్నారు.

ఇక షూటింగ్ లకి పర్మిషన్స్ లభించినా సినిమా నిర్మాణాలు ఇంకా ఊపందుకోలేదు. కరోనా భయంతో  నటులు బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు మాత్రం ఒకొక్కటిగా మొదలవుతున్నాయి. కల్యాణ్‌దేవ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సూపర్‌ మచ్చి’ షూటింగ్ సోమవారం మొదలైంది. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రభుత్వం నియమ నిబంధనలకి అనుగుణంగా పలు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ జరుపుతున్నారు. హీరో,హీరోయిన్స్ కల్యాణ్‌దేవ్‌, రచితారామ్‌తో పాటు.. అజయ్‌లపై కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. పులివాసు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. 

నిర్మాతలు రిజ్వాన్‌, ఖుషి మాట్లాడుతూ ‘‘ప్రేమకథ మేళవింపుతో రూపొందుతున్న కుటుంబ కథా చిత్రమిది. అటు మాస్‌ ప్రేక్షకులకూ కనెక్ట్‌ అయ్యే పాత్రలో కల్యాణ్‌దేవ్‌ నటిస్తున్నారు. రచితారామ్‌ నటన, తమన్‌ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నరేష్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులతో కలిసి కల్యాణ్‌దేవ్‌ చేసే హంగామా చక్కటి వినోదాన్ని పంచుతుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’అన్నారు.