ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసినప్పటి నుంచి దేశంలో ఈ విషయంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక బాలీవుడ్ హీరో మాత్రం కోట్ల విలువ చేసిన తన బంగ్లాను కుక్కలకి అంకితం చేశాడు.
వీధి శునకాల వివాదం గత వారం రోజులుగా జరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఢిల్లీ నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలని ఆర్డర్ వేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సెలబ్రిటీల సంఖ్య పెరిగిపోయింది. అలాగే వీధి కుక్కల బారిన పడుతున్న సామాన్య జనం కూడా తక్కువేమీ కాదు. ఏటా 37 లక్షల కుక్క కాటు కేసులు నమోదు అవుతున్నట్టు ప్రభుత్వ సర్వేలే చెబుతున్నాయి. అంటే రోజుకు పదివేల మందిని కుక్కలు కరిచేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ కుక్కల అంశం మన దేశంలో ఎన్నో చర్చలకు దారితీసింది. కాగా ఒక బాలీవుడ్ హీరో ఆ కుక్కల కోసమే తన కోట్ల విలువైన ఆస్తిని ఇచ్చేశాడు. ఏకంగా పెద్ద బంగ్లాను పెంపుడు కుక్కలకు ధారాదత్తం చేశాడు. అతను ఎవరో కాదు మిథున్ చక్రవర్తి.
ఆ సినిమాలో విలన్
ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగారు మిథున్ చక్రవర్తి. అంతేకాదు ఇండస్ట్రీలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. మిధున్ చక్రవర్తి మరెవరో కాదు వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన గోపాల గోపాల మూవీలో విలన్ గా కనిపించిన స్వామీజీయే. మిధున్ చక్రవర్తికి చిన్నప్పటి నుంచి కుక్కలు అంటే ప్రాణం. అతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 116 కుక్కల్ని పెంచుతున్నారట. ఈ కుక్కల్ని ఇంట్లో పెంచడం చాలా కష్టం. అందుకే తన పెద్ద బంగ్లాను ఈ కుక్కలకి ఇచ్చేశారు. ఆ బంగ్లా ఖరీదు అక్షరాల 45 కోట్ల రూపాయలు.
ప్లే గ్రౌండ్ కూడా కట్టించి
తన కుక్కల బాధ్యతే కాదు ఫ్రెండ్స్ కుక్కల బాధ్యతలు కూడా తానే తీసుకొని వాటికి పని మనుషులను పెట్టి మరీ సేవ చేస్తున్నారు. కుక్కల్ని పెంచడం అంటే రోజుకి ఇంత తినగా మిగిలిన అన్నం వేయడం కాదు... కుక్కలకి లగ్జరీ లైఫ్ ని అందిస్తున్నాడు. కుక్కల కోసం మినీ ఫామ్ హౌస్ ని నిర్మించాడు. వాటికి స్నానాలు చేసేందుకు, ఫుడ్డు వండేందుకు, వాటిని ఆడించేందుకు పని మనుషులను పెట్టాడు. అంతేకాదు కుక్కల కోసం ఒక ప్లేగ్రౌండ్ కూడా కట్టించాడు.
ముంబైలో చిన్న ఫ్లాట్ ఉన్నా కూడా లక్షాధికారితో సమానం. ఇంకా చెప్పాలంటే ఖరీదైన ప్రాంతంలో ఆ చిన్న ఫ్లాట్ కూడా కోట్ల రూపాయల విలువ చేస్తుంది. అలాంటిది ముంబై సమయంలో సమీపంలోని ఒక ఐలాండ్లో ఒకటిన్నర ఎకరాల భూమిలో కుక్కలకి ఫామ్ హౌస్ కట్టించారు మిథున్ చక్రవర్తి. అంతేకాదు తన ఆస్తిలో 45 కోట్ల రూపాయలను కుక్కల కోసం రాసిచ్చారు. మిధున్ చక్రవర్తి తన పిల్లలను ఎంత చక్కగా చూసుకుంటారో ఆ కుక్కలని కూడా అంతే ప్రేమగా చూసుకుంటారట.
మిథున్ చక్రవర్తి పుట్టుకతో ధనవంతుడు కాదు. సినిమాల్లోకి వచ్చాకే కోటీశ్వరుడు అయ్యారు. అంతకుముందు అతను కటిక పేదరికం అనుభవించారు. కనీసం తిండి, ఇల్లు కూడా సరిగా లేక ఇబ్బంది పడ్డారు. ఫుట్ పాత్‌ల మీద నిద్రపోయేవారు చివరికి హీరోగా రాణించి కోట్ల రూపాయలను సంపాదించారు. కానీ వీధి కుక్కలపై తనకున్న ప్రేమను మాత్రం వదులుకోలేకపోయారు. అందుకే ఎక్కడైనా వీధి కుక్క ఇబ్బంది పడుతూ కనిపిస్తే వెంటనే దాన్ని తన ఫామ్ హౌస్ కి తెచ్చుకుంటారు. మిధున్ చక్రవర్తి దివంగత నటి అయిన శ్రీదేవితో ప్రేమ వ్యవహారం నడిపారని కూడా అప్పట్లో చెప్పుకున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు.
