`నా మొదటి సినిమా విడుదలైనప్పుడు తీవ్రమైన విమర్శ ఎదురైంది. ఇప్పుడు నీ సినిమా చూసేందుకు మీ అమ్మ లేకపోవడం మంచిదయ్యిందని కొందరు కామెంట్‌ చేశారు` అని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది జాన్వీ కపూర్‌. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌ తనేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. 

దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ గైడెన్స్ లో ముందుకు సాగుతుంది. తొలి చిత్రం `ధడక్‌` చిత్రంతో మెప్పించింది. ఇటీవల `గుంజన్‌ సక్సేనా` లోనూ మెరిసింది. ఇందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అభిమానులు ఆశించిన స్థాయిలో ఆమె నటన లేదనే విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు తొలి సినిమా టైమ్‌లో చాలా విమర్శలు వచ్చాయి. 

తాజాగా వీటిపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో జాన్వీ చెబుతూ, తనపై వచ్చే విమర్శల ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానని చెబుతుంది. విమర్శలకు బాధపడనని  చెప్పింది. తన మొదటి సినిమా టైమ్‌లో అనేక విమర్శలు వచ్చాయని, కాకపోతే అవి తనపై ప్రభావం పడకుండా చూసుకున్నానని తెలిపింది. 

అంతేకాదు విమర్శలను సానుకూలంగా తీసుకుని నటనని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. ప్రస్తుతం జాన్వీ `రూహి అఫ్జానా`,`దోస్తానా 2` చిత్రాల్లో నటిస్తుంది.