ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన సింగర్ కాల భైరవ.. అలా తప్పు జరిగిందంటూ..
‘నాటు నాటు’కు ఆస్కార్ దక్కడం విషయంలో సహకరించిన అందరికీ థ్యాంక్యూ చెప్పే క్రమంలో... అలా తప్పు జరిగిందంటూ ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు కాల భైరవ తాజాగా సారీ చెప్పారు.
‘నాటు నాటు’కు ఆస్కార్ దక్కడం, ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వడం పట్ల ప్రముఖ సింగర్ కాల భైరవ (Kaala Bhairava) చాలా సంతోషం వ్యక్తం చేశారు. తన ఆనందానికి అవధుల్లేవని ట్వీటర్ వేదికన నోట్ రాశారు.ఇందుకు సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో.. ‘ఆర్ఆర్ఆర్’కు ప్రాతినిధ్యం వహించి.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కోసం ఆస్కార్స్ లో ప్రదర్శన ఇచ్చే అమూల్యమైన అవకాశాన్ని కలిగినందుకు చాలా కృతజ్ఞతుడిగా భావిస్తున్నాను. ఇందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరూ సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది. ఎస్ఎస్ రాజమౌళి బాబా, నాన్న, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఎస్ఎస్ కార్తీకేయ అన్న.. వారి కృషి మరియు పనితనం వల్లనే ఈ పాట ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను, సంగీత ప్రియులతో డాన్స్ చేయించింది సాంగ్. అలాగే, USAలో గ్లోరియస్ రన్ కోసం డైలాన్, జోష్ వారి టీమ్ నిరంతర కృషి, అంకితభావం వల్లే ఇది సాధ్యమైంది. అంటూ సుధీర్ఘమైన థ్యాంక్యూ నోట్ రాసుకొచ్చారు. అయితే ఇందులో ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ఆస్కార్స్ ప్రమోషన్స్ లో ఎంతగానో కృషి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పేర్లను ప్రస్తావించకపోవడంతో అభిమానులు కాలభైరవపై ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే సారీ చెబుతూ మరో ట్వీట్ చేశారు.
‘నాటు నాటూ’, ఆర్‌ఆర్‌ఆర్ విజయం తారక్ అన్న, చరణ్ అన్నలే కారణమని చెప్పడంలో నాకెలాంటి సందేహం లేదు. అయితే అకాడమీ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లో అవకాశం రావడానికి నావైపుగా ఎవరెవరకు సహకరించారు అనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడాను. అంతకు మించి ఇంకేమి లేదు. కానీ తప్పుగా కన్వే అయ్యింది. ఇందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను... అంటూ కాల భైరవ ట్వీట్ చేశారు. ఇక ఏదేమైనా భారత్ కు ‘నాటు నాటు’తో ఆస్కార్ దక్కడం పట్ల అందరూ గర్విస్తున్నారు. ఇండియన్ సినిమాకు ప్రతిష్టాత్మక గౌరవం దక్కినందుకు సంతోషిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’టీంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గల డాల్బీ థియేటర్ లో మార్చి 13న ఆస్కార్స్ వేడుక అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ హాజరయ్యారు. వేదికపై ‘నాటు నాటు’ లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ తో కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ అదరగొట్టారు. అలాగే హాలీవుడ్ డాన్సర్లు నాటునాటుకు స్టేజీ పెర్ఫామెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఇక తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఇండియాకు చేరుకుంది.