షారూఖ్‌ ఖాన్‌ ఇంట్లో ఇటీవల ఇద్దరు దొంగలు పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాళ్లిద్దరు పోలీస్‌ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి.

`పఠాన్‌`తో చాలా రోజుల తర్వాత హిట్‌ని అందుకున్నారు షారూఖ్‌ ఖాన్‌. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతోపాటు అనేక రికార్డులను క్రియేట్‌ చేసింది. హిందీ వెర్షన్‌లో `బాహుబలి 2` రికార్డులు బ్రేక్‌ చేసింది. ఈ సక్సెస్‌ ఆనందంలో ఉన్న షారూఖ్‌కి ఇంట్లో పెద్ద షాక్‌ ఎదురైంది. ఇద్దరు దొంగలు పడటం ఆయన్ని ఆశ్యర్యానికి గురి చేసింది. అంతేకాదు పోలీస్‌ విచారణలో పలు షాకింగ్‌ విషయాలు బయటకొచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఇటీవల షారూఖ్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. ముంబయిలోని మన్నత్‌ ఇంట్లో ఇద్దరు దొంగలను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వారిని పోలీసులకు అప్పగించారు. అయితే వారు గుజరాత్‌కి చెందిన పఠాన్‌ సాహిల్‌ సలీ ఖాన్‌, రామ్‌ సరాఫ్‌ కుస్వాహాగా పోలీసుల విచారణలో తేలింది. మన్నత్‌ ఇంటి సెక్యూరిటీ సిబ్బంది వారిని గుర్తించడానికి ముందు దాదాపు ఎనిమిదిగంటలపాటు వాళ్లు షారూఖ్‌ పర్సనల్‌ మేకప్‌ రూమ్‌లో ఉన్నారట. మూడో అంతస్థులో ఉన్న మేకప్‌ రూమ్‌లోకి వారు దూరడం గమనార్హం. ఫిబ్రవరి 2న ఉదయం 3 గంటలకు వాళ్లు ఇంట్లోకి చొరబడ్డారట. 

 ఉదయం పదిన్నర గంటలకు సెక్యూరిటీ పట్టుకున్నారు. 11 గంటలకు వాళ్లు మన్నత్‌ సెక్యూరి మేనేజర్ కొలీన్‌ డిసౌజాలకు సమాచారం అందించారు. కీపింగ్‌ సెక్యూరిటీ సతీష్‌ వారిని గుర్తించారని పోలీసులు తమ విచారణలో వెల్లడించారు. ఆ తర్వాత వారిని లాబీలోకి తీసుకెళ్లగా, అక్కడ వారిని షారూఖ్‌ ఖాన్‌ చూశారు. ఆ సమయంలో ఆయన పెద్ద షాక్‌కి గురయినట్టు తెలిపారు. దొంగలపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే తమ విచారణలో వాళ్లు షారూఖ్‌కి అభిమానులమని, ఆయన్ని కలవడానికి వచ్చామని చెప్పడం గమనార్హం. మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. 

ఇక ఇటీవల `పఠాన్‌`తో కెరీర్‌ బెస్ట్ హిట్‌ ని అందుకున్నారు షారూఖ్ ఖాన్‌. ఇందులో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించగా, సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్ రోల్‌ చేశారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం ఆయన `జవాన్‌` చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నయనతార కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది.