Shah Rukh Khan- Deepika Padukone: హ్యుందాయ్ కార్ వివాదంపై నమోదైన కేసులో బాలీవుడ్ స్టార్‌లు షారుక్ ఖాన్, దీపికా పదుకొణెలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కస్టమర్లను తప్పుదారి పట్టించారన్న ఆరోపణలపై తదుపరి విచారణ సెప్టెంబర్ 25కి వాయిదా పడింది
Shah Rukh Khan- Deepika Padukone: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), దీపికా పదుకొణెలకు ఊరట లభించింది. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తరపున బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన వీరిద్దరిపై ఆగస్టులో ఫిర్యాదు నమోదైంది. కార్ల కంపెనీ ప్రచారంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖాల అయ్యింది. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), దీపికా పదుకొణెలు ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వాదనలు విన్న తరువాత రాజస్థాన్ హైకోర్టు, వారికి నుండి ఊరట ఇచ్చింది. తాజాగా కోర్టు విచారణ అనంతరం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, తదుపరి విచారణ తేదీని సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.
కేసు నేపథ్యం
రాజస్థాన్‌కు చెందిన కీర్తి సింగ్ రూ.23 లక్షలు పెట్టి హ్యుందాయ్ అల్కాజర్ కారు కొనుగోలు చేశారు. అయితే కొద్ది రోజులకే కారులో తీవ్రమైన సాంకేతిక లోపాలు తలెత్తడంతో, కంపెనీ అధికారులను, డీలర్‌షిప్‌ను సంప్రదించినా స్పందన లేకపోవడంతో, ఆయన పోలీసులను ఆశ్రయించారు. అనంతరం హ్యుందాయ్ మోటార్ ఇండియా సంస్థతో పాటు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుక్ ఖాన్, దీపికా పదుకొణేలపై ఫిర్యాదు చేశారు. కస్టమర్లను తప్పుదారి పట్టించేలా ప్రచారం చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
హైకోర్టులో స్టార్ల వాదనలు
ఈ కేసులో షారుక్ ఖాన్ తరపున న్యాయవాది కపిల్ సిబల్ హాజరై, నటీనటులకు ఉత్పత్తి నాణ్యత లేదా లోపాలకు సంబంధం లేదని, వారు కేవలం ప్రచారకర్తలేనని వాదించారు. అదే విధంగా దీపిక తరఫున న్యాయవాది మాధవ మిత్రా కూడా ఇలాంటి వాదనను వినిపించారు. బ్రాండ్ అంబాసిడర్లుగా వారి పాత్ర పరిమితమని, కారులో తలెత్తిన లోపాలకు నటీనటులను బాధ్యులుగా చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు.
కోర్టు తీర్పు
వాదనలు విన్న రాజస్థాన్ హైకోర్టు, షారుక్ ఖాన్, దీపికా పదుకొణేలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధిస్తూ, ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసులోని ఇతర ఆరోపణలపై తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ 1998 నుండి హ్యుందాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఇక నటి దీపికా పదుకొణే 2023లో హ్యుందాయ్ ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో వీరి పేర్లు కేసులో చేరడం పెద్ద సంచలనంగా మారింది.
