హాలీవుడ్ పాప్ స్టార్ సెలీనా గోమేజ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో కూడా ఆమెకి అభిమానులు ఉన్నారు. తన క్యూట్ లుక్స్, పాటలతో అలరించే ఈ బ్యూటీ తన సహనటుడైన బిల్ ముర్రేను పెళ్లి చేసుకోబోతున్నట్లు షాకింగ్ ప్రకటన చేసింది. బిల్ ముర్రేకి 68 ఏళ్లు.

సెలీనా వయసు 26 సంవత్సరాలే.. తనకంటే సుమారు 40 ఏళ్లు పెద్దవాడైనా బిల్ ని పెళ్లి చేసుకుంటానని ప్రకటించడం అందరినీ షాక్ కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవంలో సెలీనా తొలిసారి రెడ్ కార్పెట్ పై హొయలొలికించింది.

ఆమె నటించిన 'ది డెడ్ డోన్ట్‌ డై' అనే సినిమాను కేన్స్ లో ప్రదర్శించారు. ఇందులో సెలీనా, బిల్ ముర్రే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో ఆమె తన సోషల్ మీడియాలో కేన్స్ కి సంబంధించి ఓ ఫోటోని షేర్ చేస్తూ.. 'కేన్స్‌లో తొలిసారి పాల్గొన్నా. 'ది డెడ్‌ డోన్ట్‌ డై' చిత్రంలో నేనూ భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మరో విషయం ఏంటంటే.. నేను నా సాహనటుడైన బిల్‌ ముర్రేను పెళ్లి చేసుకోబోతున్నాను' అంటూ షాక్ ఇచ్చింది.

ఆమె కామెడీ కోసం అలా చెప్పారో.. లేక నిజంగానే పెళ్లి చేసుకోబోతుందో అనే విషయాలు అర్ధం కాక ఆమె అభిమానులు గింజుకుంటున్నారు. గతంలో ఈ బ్యూటీ జస్టిన్ బీబర్ తో డేటింగ్ చేసింది. అయితే అతడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో సెలీనా ఈ నిర్ణయం తీసుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.