కరోనా వచ్చాక ప్రతి ఒక్కరికి హెల్త్ పై దృష్టి పెరిగింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌లకు పోకుండా సహజమైన, ఇంటి వంటలను ప్రయారిటీ ఇవ్వాలనేది తెలిసొచ్చింది. వీటిని దృష్టిలో పెట్టుకుని రామ్‌చరణ్‌ భార్య, అపోలో సంస్థల వైస్‌ చైర్మెన్‌ ఉపాసన, స్టార్‌ హీరోయిన్‌ సమంత కలిసి `URLife.co.in` పేరుతో ఓ వెబ్‌సైట్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 

ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను, ఆలోచనలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ వెబ్‌ సైట్‌ని ఏర్పాటు చేశారు.  దీనికి హీరోయిన్‌ సమంత అతిథి సంపాదకురాలిగా  వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా సమంత, ఉపాసనతో కలిసి ఆదివారం ఉదయం `తక్కాలి సాదం` అనే వంటకాన్ని ప్రిపేర్‌ చేశారు. దాన్ని ఎలా చేయాలో ఈ వెబ్‌సైట్‌లో చేసి చూపించారు. వంట చేసే క్రమంలో వీరిద్దరి మధ్య సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. 

ఇదిలా ఉంటే ఇటీవల సమంత అర్బన్‌ ఫామింగ్‌ పేరుతో ఆరోగ్యం మీద, తినే ఆహారం మీద చాలా శ్రద్ధ తీసుకుంటూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరోవైపు సమంత `సాకి` పేరుతో లేడీస్‌కి చెందిన డిజైనర్‌ వేర్‌ షోరూమ్‌ని ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇక చివరగా సమంత `జాను`లో మెరిసింది. కొత్తగా మరే సినిమాని అధికారికంగా ప్రకటించలేదు.