ఇండియన్ టెలివిజన్‌ స్క్రీన్ అన్ని భాషల్లోనూ సక్సెస్ అయిన ఒకే ఒక్క టెలివిజన్‌ షో బిగ్ బాస్‌. ఎక్కడో విదేశాల్లో బిగ్‌ బ్రదర్‌ అనే పేరుతో మొదలైన ఈ షో తరువాత బిగ్‌ బాస్‌ పేరుతో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్‌ సల్మాన్‌ ఖాన్ యాంకరింగ్‌తో ఈ షోకు ఓ రేంజ్‌లో పాపులారిటీ వచ్చింది. ఒక్కో సీజన్‌కు వ్యూయర్స్‌, రేటింగ్స్‌ పెరుగుతుండటంతో అదే బాటలో సల్మాన్‌ ఖాన్ పారితోషికం కూడా పెరుగుతూ వచ్చింది. కేవలం ఈ ఒక్క షోతోనే ఏడాదికి వందల కోట్లు వెనకేసుకుంటున్నాడు సల్మాన్‌.

గత దశాబ్ద కాలంగా ఈ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు సల్లూ భాయ్‌. మధ్యలో ఒకటి రెండు సీజన్లకు వేరే వ్యాఖ్యతలు వచ్చినా సల్మాన్ స్థాయిలో ఎవరూ రక్తికట్టించలేకపోయారు. దీంతో ఎంతో పేమెంట్ అయిన ఇచ్చి సల్మాన్‌నే తీసుకునేందుకు రెడీ అవుతున్నారు నిర్వహకులు. ఈ నేపథ్యంలోనే త్వరలో ప్రారంభం కాబోయే తాజా సీజన్‌కు సల్మాన్‌ ఖాన్‌కు ఏకంగా 500 కోట్ల రెమ్యూనరేషన్‌ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. బిగ్‌ బాస్‌ సీజన్‌ 14 కోసం సల్మాన్‌కు ఇంత మొత్తం ఆఫర్‌ చేయటం పై బాలీవుడ్‌ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్‌కు ఒక్కో షోకు దాదాపు 16 కోట్ల వరకు పారితోషికం అందుతున్నట్టుగా లెక్కలు వేస్తున్నారు.

అక్టోబర్‌లో ఈ షోను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్వహాకులు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌ దాదాపు 150 రోజుల వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే ఇండియాలో ఇంతవరకు ఏ టెలివిజన్‌ షోకు ఇవ్వని విధంగా ఒక్క సీజన్‌కే 500 కోట్ల పారితోషికం ఇవ్వటంపై విస్మయం వ్యక్తమవుతోంది. అంతేకాదు హాలీవుడ్‌లో కూడా ఇంత భారీ ఆఫర్లు అందుకున్న స్టార్స్‌ లేరంటున్నారు ఫ్యాన్స్‌.