తమిళంలో బిగ్ బాస్ సీజన్ 3 ప్రసారమవుతోంది. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో నటి మధుమిత చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సూసైడ్ అటెంప్ట్ చేసి హౌస్ నుండి బయటకి వచ్చేసింది. ఆ తరువాత బిగ్ బాస్ నిర్వాహకులు తనకు రావాల్సిన పారితోషికం చెల్లించలేదని ఆరోపణలు చేసి వివాదాల్లోకి ఎక్కింది. అయితే తను చేతిని కోసుకొని సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని తాజాగా మధుమిత వెల్లడించింది.

ఆగస్ట్ 15న బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా తను చెన్నైలో నీటి సమస్య గురించి మాట్లాడానని.. కర్ణాటకలో కుంభవృష్టి కురుస్తున్నా, తమిళనాడుకు నీరు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని కవిత రూపంలో చెప్పానని వెల్లడించారు. దానికి ఇంటి సభ్యుల నుండి వ్యతిరేకత వచ్చిందని.. బిగ్ బాస్ కూడా ఇంట్లో రాజకీయాలు మాట్లాడకూడదని ఓ లేఖ పంపారని పేర్కొంది.

అప్పటి నుండి హౌస్ లో చేరన్, కస్తూరి మినహా  మిగిలివారంతా ఒక బ్యాచ్ లా ఫాం అయ్యి తనను ఎగతాళి చేశారని.. అది భరించలేక కత్తితో చేతిని కోసుకొని ఆత్మహత్యకి పాల్పడినట్లు చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా.. బిగ్ బాస్ ప్రేక్షకులను కుక్కలు అని నటి సాక్షీ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో ఆమె క్షమాపణలు చెప్పింది.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లిన సాక్షీ అగర్వాల్, అభిరామి, మోహన్ వైద్య గతవారం మళ్లీ అతిథులుగా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. అప్పుడు నటి షెరీన్‌కు దర్శన్‌కు మధ్య ప్రేమ అంటూ చేసిన వ్యాఖ్యలకు షెరిన్‌ ఆవేదన చెందింది. దీంతో నటి షెరిన్‌ను ఓదార్చిన నటి సాక్షీ ప్రేక్షకులను కుక్కలు అంటూ వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారమే చెలరేగింది.

నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. కమల్ హాసన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తను ఆ అర్ధంతో అనలేదని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది. ఇకపై జాగ్రత్తగా ప్రవర్తిస్తానని చెప్పింది.