గ్యాప్‌ రావడమనేది కావాలని తీసుకున్నది కాదని, అసలు గ్యాప్‌ గురించే ఆలోచించనని తెలిపింది సాయిపల్లవి. తాను కళని ఎక్కువగా నమ్ముతానని, తాను చేయాల్సిన సినిమా అయితే అది తన వద్దకు వస్తుందని,

తనకు సినిమా కథలు రాసి పెట్టి ఉంటే అవే తనని వెతుక్కుంటూ వస్తాయని చెప్పింది నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి. తాను సినిమాల ఎంపికలో తొందరపడనని, నచ్చిన స్క్రిప్ట్ లనే ఎంచుకుంటానని తెలిపింది. టాలీవుడ్‌ లేడీ పవర్‌ స్టార్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకున్న సాయిపల్లవి.. ప్రస్తుతం రానాతో కలిసి `విరాటపర్వం` చిత్రంలో నటించింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది సాయిపల్లవి. 

అందులో భాగంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన సాయిపల్లవి.. తెలుగులో సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణమేంటని `ఏషియానెట్‌` ప్రతినిధి అడిగిన ప్రశ్నకి స్పందించింది. తాను కరోనా పాండమిక్‌కి ముందు `లవ్‌ స్టోరీ`, `విరాటపర్వం` చిత్రాలను చేశానని, ఆ తర్వాత `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలో నటించినట్టు తెలిపింది. అయితే ఇప్పుడు గ్యాప్‌ రావడమనేది కావాలని తీసుకున్నది కాదని, అసలు గ్యాప్‌ గురించే ఆలోచించనని తెలిపింది. 

తాను కళని ఎక్కువగా నమ్ముతానని, తాను చేయాల్సిన సినిమా అయితే అది తన వద్దకు వస్తుందని, తన కోసం ఓ కథ ఉంటే కచ్చితంగా అదే నన్ను వెతుక్కుంటూ వస్తుందని, దానికోసం నేను పెద్దగా ఆలోచించనని తెలిపింది. స్పీడ్‌గా చేయాలనే ఆలోచన లేదని చెప్పింది. మనం చేసే సినిమాలు నెక్ట్స్ తరానికి కూడా గుర్తిండిపోయేలా ఉండాలని, అందుకే స్క్రిప్ట్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది. 

తక్కువ సినిమాలు చేస్తున్నానా? ఎక్కువ చేస్తున్నానా అనేది తాను చూసుకోనని, మంచి సినిమా చేయాలనేదే తన లక్ష్యమని తెలిపింది. తమిళంలో శివాజీ గణేషన్‌ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారని చెప్పింది. అయితే కొన్ని థియేటర్లో ఆడతాయి, కలెక్షన్లు చేస్తాయి, కొన్ని హృదయాలను తాకేలా ఉంటాయి. ఫైనల్‌గా వాటి గురించే మాట్లాడుకుంటారు. మనకు ఆ సినిమాలే గుర్తుంటాయి, మనసుకి సంతృప్తినిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం తెలుగులో కూడా కథలు వింటున్నానని, ఫైనల్‌ అయితే చెబుతానని తెలిపింది. తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ సినిమా, అలాగే `గార్గి` మూవీ చేస్తున్నట్టు తెలిపింది సాయిపల్లవి. 

`విరాటపర్వం` సినిమా గురించి చెబుతూ, `ఈ కథ చెప్పినప్పుడు నేనే సరళ అనుకుని వెన్నెల పాత్రలో నటించాను. వేణు ఉడుగుల ఈ స్టోరీ చెప్పగానే నాకు కొత్తగా అనిపించింది. నేను తమిళనాడులో పెరిగాను. అక్కడ జరిగిన సంఘటనలు వేరు.. కానీ ఇక్కడ(తెలంగాణ)అప్పట్లో ఇలాంటి(నక్సల్స్ ఉద్యమాలు) సంఘటనలు జరిగిందని తెలియదు. దర్శకుడు వేణు నాకు చాలా తెలియని విషయాలను చెబుతూ ఎడ్యుకేట్‌ చేశాడు. సరళ ఫ్యామిలీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా కేవలం అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ‘విరాటపర్వం’ చిత్రాన్ని తెరకెక్కించారు. 

వేణు ఈ సినిమా కథను ముందుగా నాకు చెప్పారు. ఆ తరువాత నిర్మాతలు సురేష్ బాబు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో రానా ఈ కథను చదివి, నచ్చడంతో ఈ సినిమాను చేశారు. అంతకు ముందు వేరే వారికి కూడా వినిపించారు. కానీ వారు అంగీకరించలేదు. రవన్న పాత్రని రానా పోషించడం చాలా హ్యాపీ. ఆయన ప్రాజెక్ట్‌లోకి వచ్చాక చాలా మార్పులు జరిగాయి. గొప్పగా సినిమాను తెరకెక్కించారు` అని పేర్కొంది సాయిపల్లవి. 

`ఊర్లో అమ్మాయిలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో నేను అలా ఉంటాను. పల్లెటూరి అమ్మాయిలాగే నేను మాట్లాడుతా. ఈ చిత్రంలో నేను ఎలాంటి మేకప్‌ లేకుండా నటించాను. ఇదొక హానెస్టీ ఫిల్మ్ అని, అందరికి నచ్చుతుందని, మన మట్టిలాంటి చిత్రమని తెలిపింది. ఇక లేడి పవర్‌స్టార్‌`, `లేడి సూపర్‌ స్టార్‌` అనే బిరుదలపై స్పందిస్తూ, అభిమానులు ప్రేమతో అలా పిలుస్తున్నారు. కానీ నేను దానిని మనసుకు తీసుకోను. కథలను విన్నప్పుడు అవేవి నేను పట్టించుకోను. జనాలకు నచ్చలే మంచి మంచి సినిమాల్లో నటించాలనే నా లక్ష్యం` అని పేర్కొంది సాయిపల్లవి.