తెలుగు లోగిళ్ళలో దివాలి పండగ శోభ సంతరించుకోగా, ఈ వేడుకను మరింత కాంతివంతంగా చేయడానికి ఆర్ ఆర్ ఆర్ టీమ్ దిగిపోయారు. దీపావళి శుభాకాంక్షలు చెవుతూ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. సాంప్రదాయ దుస్తులలో కొమరం భీమ్ ఎన్టీఆర్, రామరాజు చరణ్ లతో పాటు దర్శకుడు రాజమౌళి కనువిందు చేశారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి ఈ దీపావళి గిఫ్ట్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. 

గత నెలలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు, సినిమా లవర్స్ కి మంచి అనుభూతి పంచారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో అంచనాలకు మించి రాజమౌళి రూపొందించగా, ఆర్ ఆర్ ఆర్ హైప్ మరో స్థాయికి చేరింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. 

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆలస్యం కాగా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. నిర్మాత డి వి వి దానయ్య ఆర్ ఆర్ ఆర్ మూవీని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

అజయ్ దేవ్గణ్ ఆర్ ఆర్ ఆర్ లో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఆయనకు జంటగా క్యామియో రోల్ లో శ్రేయా శరణ్ నటించడం విశేషం. అలియా భట్ చరణ్ కి జంటగా నటిస్తుండగా, బ్రిటీష్ నటి ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ తో జతకట్టనుంది.