ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో రెండో షెడ్యూల్‌ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక ఇప్పటి వరకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించిన టైటిల్‌ కానీ ఫస్ట్‌లుక్‌ కానీ ఇతర నటీనటుల వివరాలు కానీ బయటకు రాలేదు. మార్చి 27 న  రామ్‌చరణ్‌ పుట్టినరోజు వస్తోంది. అప్పుడు సినిమాలో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని  చిత్ర యూనిట్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఆ ఫస్ట్ లుక్ విడుదల కోసం ఇప్పటినుంచే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో  బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. ఆయన పాత్ర చిన్నదే అయినా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని అజయ్‌ సన్నిహితులు మీడియా ద్వారా వెల్లడించారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాను హిందీలో ‘మక్కీ’ పేరుతో డబ్ చేశారు. 

ఈ సినిమాకు అజయ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అప్పటి నుంచి రాజమౌళి, అజయ్‌ మంచి స్నేహితులయ్యారు. అందుకే సినిమాలో అజయ్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం అజయ్‌ ‘తానాజీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక ఆయన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలో నటిస్తారని సమాచారం.