కరోన వైరస్‌ ప్రభావంతో వినోద పరిశ్రమ దాదాపుగా మూతపడింది. ఐదు నెలలుగా సినిమాల రిలీజ్‌లతో పాటు షూటింగ్‌లు, ప్రమోషన్‌ కార్యక్రమాలు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ఆగిపోయాయి. లాక్‌ డౌన్‌ సడలింపులతో అన్ని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో సినీ పరిశ్రమ కూడా కొద్ది కొద్దిగా పనులు ప్రారంభిస్తుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉన్న సినిమాలు పనులు ప్రారంభించగా ఒక్కొక్కటిగా నిర్మాణ దశలో ఉన్న సినిమాలు కూడా పట్టాలెక్కుతున్నాయి.

సీనియర్‌ హీరో నాగార్జున కూడా తన తాజా చిత్రం వైల్డ్‌ డాగ్ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. యంగ్ హీరోలతో అంతా వరుసగా సినిమాల షూటింగ్‌లు మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్‌ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న దర్శకుడు రాజమౌళి, వచ్చే నెలలో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేసేందుకు ఫిక్స్‌ అయ్యాడట.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం దసరా తర్వాత షూటింగ్ ప్రారంభించాలని తెలుస్తోంది. అంతేకాదు షూటింగ్ ప్రారంభించిన నెల లోపు ఎన్టీఆర్‌ టీజర్‌ను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 5నెలలుగా ఆగిపోయిన ఆర్ఆర్ఆర్‌ సినిమా పనులు మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్నానయని తెలుస్తోంది.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్‌కు జోడిగా ఒలివియా మోరిస్‌ నటిస్తోంది.