రవితేజ క్రాక్ మూవీ నేడు గ్రాండ్ గా విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ షోల ప్రదర్శన నిలిచిపోయింది. ఉదయం షో బుక్ చేసుకున్న ప్రేక్షకులకు క్రాక్ సినిమా ప్రదర్శన లేదని సందేశం రావడం జరిగింది. అలాగే నేడు ఈ మూవీ ప్రదర్శన కష్టమే అన్న మాట వినిపిస్తుంది. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న మొదటి చిత్రం క్రాక్ ఇలా ఆర్థిక ఇబ్బందుల కారణం విడుదల నిలిచిపోవడం రవితేజ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులను తీవ్ర నిరాశకు గురి చేసింది. 

క్రాక్ మూవీ నిర్మాత ఠాగూర్ మధు గతంలో చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ చేయకపోవడంతో స్క్రీన్ సీన్ మీడియా కోర్ట్ ని ఆశ్రయించారు. క్రాక్ మూవీ విడుదల నిలిపివేయాలని పిటీషన్ వేయగా... కోర్ట్ ఆదేశాల మేరకు ప్రదర్శన నిలిపివేశారు. ఈ సమస్యకు పరిష్కారం దొరికి, వెంటనే మూవీ విడుదల కావాలని అందరూ కోరుకుంటున్నారు.

దర్శకుడు గోపి చంద్ మలినేని, రవి తేజ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ క్రాక్. ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ దక్కడంతో మూవీపై హైప్ ఏర్పడింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక రోల్స్ చేశారు. క్రాక్ మూవీకి సంగీతం థమన్ సమకూర్చారు.