టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒక్కసారి కలిసి పని చేసిన అమ్మాయిని మరోసారి రిపీట్ చేయడానికి హీరోలు ఇష్టపడరు. పైగా ఈ మధ్యకాలంలో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న బ్యూటీలు చాలా తక్కువగా కనిపిస్తున్నారు.

కాజల్, తమన్నాలు సీనియర్ హీరోయిన్లు అయిపోయారు. రకుల్ డిమాండ్ కూడా బాగా తగ్గింది. 'డీజే' సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ పెంచేసుకుంది పూజాహెగ్డే. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. మరోపక్క 'గీత గోవిందం'తో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది రష్మిక.

ఈ ఇద్దరు తారలు ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్నారు. పూజాకి బాలీవుడ్ లో అవకాశాలు వస్తుంటే, రష్మికకి తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో మంచి డిమాండ్ ఏర్పడింది. స్టార్ హీరోలతో పాటు కుర్ర హీరోలు కూడా తన సినిమాల్లో ఈ ఇద్దరు హీరోయిన్లనే ప్రిఫర్ చేస్తున్నారు. వీరి డేట్స్ దొరకని పక్షంలో మాత్రమే మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. 

టాలీవుడ్ లో పెద్ద సినిమా ఏది మొదలైనా.. మొదట ఈ భామలనే హీరోయిన్లుగా సంప్రదిస్తున్నారట. పారితోషికం విషయంలో కూడా ఈ ఇద్దరూ రాజీ పడాల్సిన అవసరం రావడం లేదు. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ లైఫ్ స్పాన్ అయినా కొంతకాలమే. మరి ఈ ఇద్దరు భామలు ఎంతకాలం చక్రం తిప్పుతారో చూడాలి!