బ్యాక్‌ టూ బ్యాక్‌ ప్రముఖ స్టార్స్ బర్త్ డేలతో సందడి చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే లతో అలరించారు. అభిమానులు ఫుల్‌ ఖుషీ అయ్యారు. నేడు మొత్తం వెంకీ బర్త్ డే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. ఇక ఇప్పుడు రానా బర్త్ డే హంగామా షురూ అయ్యింది. తాజాగా రానా బర్త్ డే సీడీపీని విడుదల చేశారు. ప్రస్తుతం ఇది వరుస ట్వీట్లతో వైరల్‌ అవుతుంది. అంతేకాదు, హ్యాపీ బర్త్ డే యాష్‌ ట్యాగ్‌ కూడా సందడి చేస్తుంది. ఇది ట్రెండ్‌ అవుతుంది. అభిమానులు, సినీ వర్గాలు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. 

ఇక ఇప్పుడు విడుదల చేసిన బర్త్ డే సీడీపీలో `నేనే రాజు నేనే మంత్రి` చిత్రంలోని కూర్చీలో కూర్చొన్న లుక్‌ ప్రధానంగా ఉండగా, వెనకాల భళ్లాలదేవ, `రుద్రమదేవి`లోని లుక్‌, అలాగే `లీడర్‌`, `ఘాజీ`, `కృష్ణమ్‌ వందేజగద్గురుమ్‌` వంటి చిత్రాల్లోని పాత్రల లుక్‌లు ఆకట్టుకుంటున్నాయి. 

రానా వరుసగా మల్టీ లాంగ్వేజ్‌ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. మల్టీటాలెంటెడ్‌గానూ సత్తా చాటుతున్నారు. `బాహుబలి`లో భళ్లాలదేవగా పాపులర్‌ అయిన రానా.. ఆ ఇమేజ్‌ నుంచి త్వరగానే బయటపడ్డారు. మూసధోరణి చిత్రాలతో కాకుండా విభిన్నమైన, ప్రయోగాత్మక కథలను ఎంపిక చేసుకుంటూ హీరోగానే కాకుండా నటుడిగా నిరూపించుకుంటున్నారు.  ప్రస్తుతం ఆయన `అరణ్య`, `విరాటపర్వం` చిత్రాల్లో నటిస్తున్నారు. `విరాటపర్వం` చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్‌ రేపు విడుదల చేయనున్నారు.