సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని వర్మ చెప్పాడు. తాజాగా వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో ఆయన లక్ష్మీపార్వతిపై చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

ముందుగా యాంకర్ వర్మని ప్రశ్నిస్తూ.. లక్ష్మీపార్వతిపై కొందరిలో నెగెటివ్ ఇంప్రెషన్ ఉంది. ఆమె కారణంగానే చివరిరోజుల్లో ఎన్టీఆర్ బాగా ఇబ్బంది పడ్డారనే భావన ఉంది.. దీన్ని మీరెలా చూపించబోతున్నారని అడిగింది.

దీనికి వర్మ స్పందిస్తూ.. ''ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతి రిలేషన్ కారణంగానే ఆయన పదవి పోవడం, చనిపోవడం జరిగింది. వారిద్దరి కలయిక వలన రాజకీయాల్లో ఊహించని పరిణామాలు ఏర్పడ్డాయి. ఆ రాజకీయ పరిణామలన్నింటినీ కలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నాను'' అని చెప్పారు.

అందరిలానే మొదట్లో తాను కూడా లక్ష్మీపార్వతి గురించి తప్పుగా ఆలోచించినట్లు.. కానీ ఎన్టీఆర్ గారు ఆమె గొప్పదనం గురించి చెప్పినప్పటి నుండి పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెట్టినట్లు వెల్లడించారు.