సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో సంతోషం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో సంతోషం మిగల్లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు 170 సినిమాల్లో నటించిన రజనీకాంత్ కి రెండు చిత్రాలు మాత్రమే సంతృప్తినిచ్చాయట. తాజాగా రజనీకాంత్ చెన్నైలోని `హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ థ్రూ క్రియ యోగా` అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితంలో సంతృప్తి లేదన్నారు.
తాను గొప్ప నటుడిని అని చాలా మంది అంటుంటారని, వాళ్లు ప్రశంసిస్తున్నారో, విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను ఎన్నో సినిమాలు చేసినప్పటికీ `రాఘవేంద్ర`,`బాబా` చిత్రాలు మాత్రమే తనకు సంతృప్తినిచ్చాయని వెల్లడించారు. `బాబా` సినిమా చూశాక చాలా మంది హిమాలయాలకు వెళ్లినట్టు చెప్పారని, తన అభిమానులు కొందరు ఏకంగా సన్యాసులుగా మారిపోయారని, కానీ తాను మాత్రం ఇప్పటికీ నటుడిగానే కొనసాగుతున్నానని తెలిపారు రజనీ.
ఆరోగ్యం గురించి చెబుతూ, హిమాలయాల్లో కొన్ని అపూర్వమైన మూలికలు దొరుకుతాయని, అవి తింటే వారానికి సరిపడా శక్తి లభిస్తుందన్నారు. ఆరోగ్యం అనేది మనిషికి చాలా ముఖ్యమైనదని చెప్పిన రజనీకాంత్, అనారోగ్యం పాలైతే మనకు కావాల్సిన వాళ్లు తట్టుకోలేరని వెల్లడించారు. తన జీవితంలో డబ్బు, పేరు ప్రఖ్యాతలు అన్నీ చూశానని, సంతోషం మాత్రం దక్కలేదన్నారు. సంతోషం, ప్రశాంతత కనీసం పది శాతం కూడా దక్కలేదని, ఎందుకంటే అవి శాశ్వతంగా మనతో ఉండేవి కావని పేర్కొన్నారు సూపర్ స్టార్.
ప్రస్తుతం రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కోలీవుడ్ సినిమాని జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత రజనీకాంత్‌కి సొంతం. అంతేకాదు ఇండియన్ సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆయనకు దేశ విదేశాల్లోనూ అభిమానులున్నారు. స్టయిల్, మ్యానరిజానికి కేరాఫ్‌గా నిలిచే రజనీకాంత్ యాక్షన్ సినిమాలతో కోలీవుడ్‌ని ఉర్రూతలూగించారు.
`అపూర్వ రాగంగల్` చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేసిన రజనీకాంత్ `అంతులేని కథ`, `అవర్గల్`, `16వయథినిలే`, `బిల్లా`, మూండ్రు ముగమ్`, `ధర్మథిన్ తలైవన్`, `థళపతి`, `అన్నమలై`, `చంద్రముఖి`,`బాష`, `బాబా`, `నరసింహ`, `ముత్తు`, `శివాజీ`, `రోబో`, `2.0` వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలు చేశారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్‌తో `జైలర్` మూవీలో నటిస్తున్నారు రజనీ.
