ఒక్క వీడియోతో సూపర్ పాపులారిటీ దక్కించుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్ లో 'శ్రీదేవిబంగ్లా' సినిమాలో నటించింది. ప్రశాంత్ మాంబుల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఈ సినిమాలో శ్రీదేవి అనే పాత్రలో నటిస్తోన్న ప్రియా ప్రకాష్. రీల్ లైఫ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఓ చిన్న పాపకి ఆటోగ్రాఫ్ ఇస్తోన్న సన్నివేశంతో టీజర్ మొదలైంది. ''ఓ నటిగా నేను చాలా అదృష్టవంతురాలిని. నాకు జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చాడు. పేరు, డబ్బు, సంతోషం.. ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా నాకు అభిమానులు ఉన్నారు. కానీ..'' అని డైలాగ్ చెప్పే సమయంలో కాలింగ్ బెల్ మోగుతుంది. 

ఆ తరువాత ప్రియా వెక్కి వెక్కి ఏడుస్తూ, చెడు అలవాట్లకు దగ్గరై చివరకి బాత్ టబ్ లో శవంగా కనిపిస్తుంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. సినిమా టైటిల్, టీజర్ లో చూపించిన సన్నివేశాలను చూస్తుంటే దివంగత శ్రీదేవి గుర్తుకువస్తోంది.

బాత్ టబ్ లో శ్రీదేవి మరణాన్ని కూడా ఈ సినిమాలో ఓ సన్నివేశంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.