కోలీవుడ్ బుల్లితెర నటి చిత్ర ఆత్మహత్య సంచలనం రేపింది. చెన్నైలోని ఓ హోటల్ లో నటి చిత్ర శవమై కనిపించారు. కొద్దిరోజుల క్రితమే వ్యాపారవేత్త హేమనాథ్ తో నిశ్చితార్ధం జరుపుకున్న చిత్ర ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చిత్ర బాడీపై గాయాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇది హత్య కూడా కావచ్చని మొదట పోలీసులు భావించారు. ఇతే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమెది ఆత్మహత్యే అని తేలిందని సమాచారం. 
 
కానీ చిత్ర ఆత్మహత్య వెనుక బలమైన కారణం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చిత్ర ప్రియుడు హేమనాథ్ ని పోలీసులు విచారిస్తున్నారు. హమనాథ్-చిత్రల పెళ్ళికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. అయితే చిత్ర చనిపోవడానికి ముందు వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిసింది. పెద్దల అంగీకారంతో పెళ్లి ముహూర్తం పెట్టుకున్న వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజే ఎందుకు చేసుకున్నారనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. 
 
పోలీసు విచారణలో చిత్ర మొబైల్ లోని ఫోటోలు, వీడియోలు మరియు సందేశాలు డిలీట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎవరైనా చిత్ర మొబైల్ లో డేటా డిలేట్ చేశారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు చిత్ర తల్లి హేమనాథ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చిత్రను హేమనాథ్ కొట్టి చంపారని ఆమె ఆరోపిస్తున్నారు. త్వరలోనే చిత్ర మృతిలో నిజానిజాలు బయటికి రానున్నాయి.