పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` చిత్ర దర్శక, నిర్మాతలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి వందల ఫోన్‌ కాల్స్ వస్తున్నాయని, అమ్మాయిలు కావాలని అడుగుతున్నారని, దీంతో తన ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన `వకీల్‌సాబ్‌` చిత్ర దర్శకుడు వేణు శ్రీరాం, నిర్మాత దిల్‌రాజులపై ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగిందంటే.. `వకీల్‌సాబ్‌`లో కీలక పాత్రలో నటించిన అంజలి, నివేదా థామస్‌, అనన్యపాండేలు, వేధింపులకు గురైన తర్వాత కేసు నమోదవుతుంది. వీరిని వ్యభిచారులుగా ట్రీట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే అశ్లీల సన్నివేశంలో ఓ ఫోన్‌ నెంబర్‌ చూపించారు. ఆ ఫోన్‌ నెంబర్‌ తనదే అని సుధాకర్‌ అనే వ్యక్తి బయటకు వచ్చాడు. అంతేకాదు ఇటీవల పంజాగుట్ట పోలీస్‌లకు దర్శకుడు వేణు శ్రీరామ్‌, నిర్మాత దిల్‌రాజులపై ఫిర్యాదు చేశారు. `అమ్మాయిలు కావాలంటే ఈ నెంబర్‌కి కాల్‌ చేయండి` అనే సీన్‌లో తన ఫోన్‌ నెంబర్‌ని చూపించారని ఆయన పేర్కొన్నారు. ఆ ఫోన్‌ నెంబర్‌కి వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అమ్మాయిలు కావాలని అడుగుతున్నారని, దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. తన పర్మిషన్‌ లేకుండా తన ఫోన్‌ నెంబర్ ఎలా వాడతారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

సినిమా విడుదలైనప్పటి నుంచి తనకు వందల కొద్ది ఫోన్లు వస్తున్నాయన్నారు. తనకు ఉన్నది ఒకటే ఫోన్‌ నెంబర్‌ అని,  బ్యాంక్‌, గూగుల్‌ పే, పాన్‌ కార్డ్, ఆధార్‌ ఇలా అన్ని ఆధారాలకు ఈ ఫోన్‌ నెంబరే లింక్‌ అయి ఉందన్నారు. తీరా దీనిపై ఎంక్వైరీ చేస్తే, `వకీల్‌సాబ్‌` సినిమాలో నా నెంబర్‌ డిస్ల్పే అవుతుందంటున్నారు. పంజాగుట్ట ఏసీపీని కలిశామని, కోర్ట్ లో పరువునష్టం దావా వేయమని సూచించినట్టు సుధాకర్ తెలిపారు. తాజాగా ఆయన కోర్ట్ ని ఆశ్రయించినట్టు తెలుస్తుంది.