ప్రధాని మోడీ, హాలీవుడ్ దిగ్గర దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ .. తనతో, రాజమౌళితో ఒకే మాట చెప్పారని అంటున్నారు `ఆర్‌ఆర్‌ఆర్` రైటర్ విజయేంద్రప్రసాద్. ఆయన ఆసక్తికర కామెంట్ చేశారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా `ఆర్‌ఆర్‌ఆర్` గురించిన చర్చే నడుస్తుంది. ఈసినిమాకి ఆస్కార్‌కి వచ్చిన నేపథ్యంలో ఇండియా మొత్తం గర్వపడుతుంది. రాజకీయ ప్రముఖులు,సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల నుంచి సాధారణ ప్రజలు సైతం సినిమాపై, టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. `నాటు నాటు` పాటకిగానూ ఒరిజినల్ సాంగ్ విభాగంలో `ఆర్‌ఆర్‌ఆర్`కి ఆస్కార్ వరించింది. ఒక ఇండియన్ సినిమాకి ఆస్కార్ రావడమనేది, అది కూడా సాంగ్ విభాగంలో ఆస్కార్ రావడం మొదటి సారి కావడంతో యావత్ ఇండియా జయహో అంటోంది.
ఇక దీనిపై `ఆర్‌ఆర్‌ఆర్` కథ రైటర్, దర్శకుడు రాజమౌళి ఫాదర్, రాజ్యసభ ఎంపీ విజయేంద్రప్రసాద్ స్పందించారు. ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. కథలో ఎమోషన్ నచ్చి అంతర్జాతీయ ఆడియెన్స్ సినిమాని ఆదరించారని, ఇంతటి విజయాన్ని అందించారని చెప్పారు. మరోవైపు ఓ మీడియాలో ముచ్చటిస్తూ గతంలో ప్రధాని మోడీ తనకు చెప్పిన విషయాన్నే, హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ తనకు చెప్పారని వెల్లడించారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం ప్రధాని మోడీని కలిశాను. ఆయన మాతో నాలుగు నిమిషాలు మాట్లాడుతారనుకుంటే, నాలభై నిమిషాలు మాట్లాడారు. ఆ సమయంలో ప్రపంచం మొత్తం భారత్ వైపు ఎలా చూడాలి, అనే దాని గురించే చర్చించుకున్నాం. మోడీ విజన్‌కి ఆశ్చర్యపోయాను. మన దేశ సంస్కృతి చాలా గొప్పదని, దానిని ప్రపంచానికి చాటేలా కృషి చేయాలని చెప్పారు` అని వెల్లడించారు విజయేంద్రప్రసాద్.
అయితే రాజమౌళి.. దర్శకుడు స్టీవెల్ స్పీల్ బర్గ్ ని కలిసినప్పుడు కూడా ఆయన ఇదే చెప్పారన్నారు విజయేంద్రప్రసాద్. ఇండియా కల్చర్ ఉట్టిపడేలా సినిమాలు తీయాలని ఆయన రాజమౌళికి సూచించారని దిగ్గజ రైటర్ వెల్లడించారు. `ఆర్‌ఆర్‌ఆర్` విజయం వెనుక మూడు తరాల కృషి ఉందని తెలిపారు. తన సోదరుడు శివ శక్తి దత్తా స్క్రిప్ట్ రాయడానికి సహాయం చేస్తే, రాజమౌళి సినిమాకి దర్శకత్వం వహించారని తెలిపారు. వీరితోపాటు రాజమౌళి భార్య రమారాజమౌళి, కీరవాణి, కాలభైరవ..ఇలా చాలా మంది ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ సక్సెస్‌సాధ్యమైందన్నారు విజయేంద్రప్రసాద్.
ప్రస్తుతం ఆయన మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం. దాదాపు వెయ్యి కోట్లతో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న.
