నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కు పుస్తకాలు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఆయన ఖాళీ దొరికినప్పుడల్లా పుస్తక పఠనంలో నిమగ్నమైపోతారు. అలాగే అవకాసం దొరికినప్పుడల్లా పుస్తకాలను రిఫర్ చేస్తూ మాట్లాడుతూంటారు. అంతలా ఇష్టం పవన్ కు పుస్తకాలంటే. ఇప్పుడు కూడా ఆయన మరోసారి ఓ పుస్తకం గురించి ప్రస్తావించారు.  ఆ పుస్తకమే వనవాసి.

గత కొద్ది రోజులుగా  పవన్ కల్యాణ్ ప్రస్తుతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అంశంపై తీవ్రంగా దృష్టి పెట్టారు. ఆయన తన పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా నల్లమల అంశంపైనే ట్వీట్లు చేస్తూ ఎవేర్ నెస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, వనవాసి అనే అనువాద పుస్తకం గురించి పవన్ స్పందించారు. బనవాసి (తెలుగులో వనవాసి) అనే పుస్తకాన్ని 1938లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ రచించారని, దాన్ని సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించారని పేర్కొన్నారు.

తాను టీనేజ్ లో ఉండగా మద్రాస్ బుక్ ఫెయిర్ లో ఆ పుస్తకం కొన్నానని వివరించారు. ఒక్కసారి ఈ పుస్తకం చదివితే ఎవరైనా ప్రకృతి ప్రేమికులుగా మారిపోతారని, అడవుల సంరక్షణ కోసం ముందుకు కదులుతారని నమ్మకం వ్యక్తం చేశారు. వనవాసి పుస్తకం ప్రకృతిపై తన ప్రేమను మరింత పెంచిందని తన ట్వీట్ లో వెల్లడించారు. అంతేకాకుండా, జర్మన్ రచయిత పీటర్ వోలెబెన్ రచించిన ది సీక్రెట్ నెట్ వర్క్ ఆఫ్ నేచర్ పుస్తకాన్ని కూడా ట్వీట్ చేశారు.