అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సైరా చిత్రం ఎట్టకేలకు అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైరా చిత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వసూళ్లు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ జీవించారు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీ హీరోలంతా విడుదల రోజే సైరా చిత్రాన్ని అభిమానులతో కలసి వీక్షించారు. సాయిధరమ్ తేజ్, వైష్ణవ్, శిరీష్ , వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ప్రతి ఒక్కరు సైరా చిత్రాన్ని చూశారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. 

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ కు సైతం పవన్ తన సోదరుడు చిరంజీవితో కలసి హాజరయ్యాడు. సైరా చిత్రం ఘనవిజయం సాధిస్తుందని పవన్ ఆకాంక్షించాడు. కానీ సైరా రిలీజ్ తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ మెగా హంగామాలో కనిపించలేదు. పవన్ కళ్యాణ్ సైరా చిత్రాన్ని ఇంకా చూడలేదు. దీని గురించి అభిమానుల్లో చర్చ జరుగుతోంది. 

పవన్ కళ్యాణ్ సైరా చిత్రాన్ని చూడకపోవడానికి కారణం ఉంది. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో భాదపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయుర్వేద చికిత్స చేయించుకునేందుకు పవన్ కళ్యాణ్ కేరళ వెళ్లారు. పవన్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేకపోవడం వల్లే సైరా చిత్రాన్ని చూసేందుకు వీలుపడలేదు. 

గతంలో రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ చిత్రాన్ని ప్రత్యేకంగా చూశారు. రాంచరణ్, రంగస్థలం చిత్ర యూనిట్ ని అభినందించిన సంగతి తెలిసిందే.