మెగాస్టార్ చిరంజీవి కలల ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర సైరా చిత్రంగా వెండితెరపైకి వచ్చేసింది. బుధవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రం రికార్డు స్థాయిలో 37 కోట్ల షేర్ రాబట్టింది. 

ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో చిత్ర యూనిట్ నేడు సక్సెస్ మీట్ నిర్వహించింది. సక్సెస్ మీట్ లో సైరా చిత్రాన్ని మూలకారకులైన పరుచూరి బ్రదర్స్ లో ఒకరు పరుచూరి గోపాలకృష్ణ ప్రసంగించారు. గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 2004లో తన సోదరుడు వెంకటేశ్వర రావు సైరా కథని రాశారు. సినిమాగా తెరకెక్కించడానికి మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాం. 

చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా తరచుగా ఆయనకు సైరా కథ వినిపించేవాళ్ళం. ఎలాగైనా ఈ చిత్రం తెరకెక్కాలనే బాధ మాది. మా బాధ చూడలేక.. పోనీ రాంచరణ్ తో ఈ సినిమా చేస్తారా అని కూడా చిరంజీవి గారు అడిగారు. కానీ మేము ఈ పాత్రలో చిరంజీవి గారిని మాత్రమే ఊహించుకున్నాం. 

కేవలం బడ్జెట్ కారణాల వల్లే ఈ చిత్రం 16 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. మొదట ఈ చిత్రానికి 70 కోట్ల బడ్జెట్ అనగానే మాకు భయం వేసింది. కానీ ఈ చిత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. సైరా చిత్రం మీ బిడ్డ.. ఆ బిడ్డని నా బిడ్డ చేతుల్లో పెట్టారు. ఇప్పుడు సైరా చిత్రాన్ని ప్రపంచమంతా చిరంజీవ అని దీవిస్తున్నట్లు చిరంజీవి గారు తనకు మెసేజ్ చేశారని పరుచూరి గోపాలకృష్ణ తన ప్రసంగంలో పేర్కొన్నారు.