బిగ్ బాస్ సీజన్ 2 పై ఆడియన్స్ లో ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ షో ముగింపు దశకి చేరుకోవడంతో మరిన్ని ఆసక్తికరమైన గేమ్స్ ని కంటెస్టెంట్స్ తో ఆడిస్తూ మరింత ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ షోపై సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. షోని ట్రోల్ చేసే నెటిజన్లు కూడా చాలా మంది ఉన్నారు. ఫిజికల్ టాస్క్ లు వచ్చేసరికి మహిళలను ఇష్టం వచ్చినట్లుగా హేండిల్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా ఇదే విషయంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. రచయిత ఆయనకున్న అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన అనుభవాలను ఓ కార్యక్రమం ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా బిగ్ బాస్ 2 పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలోచింపదగిన విధంగా ఉన్నాయి. ''బిగ్ బాస్ 2 షోలో జరిగే కొన్ని సంఘటనలను నేను జీర్ణించుకోలేకపోతున్నాను.

స్త్రీలు, పురుషులు అన్ని విషయాల్లో సమానమే.. కానీ శరీర నిర్మాణాన్ని బట్టి శక్తిలో మాత్రం వాళ్లు సగం కాదనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది బిగ్ బాస్ షోలో స్త్రీ, పురుషులకు కలిపి పోటీలు పెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్త్రీ, పురుషులను కలిపి పరిగెత్తించారు. అలా పరుగెడుతూ కొంతమంది ఆడపిల్లలు పడిపోయినప్పుడు చాలా బాధ కలిగింది.

ఇక ఇటీవల షోలో కార్లో నుండి ఇద్దరు పురుషులు.. మహిళలను బలవంతంగా బయటకి నెట్టేయడానికి ప్రయత్నించడం నాకు చాలా బాధని కలిగించింది. బలవంతులు, బలహీనులను నెట్టేసి గెలవడం క్రీడా ధర్మం కాదు.. స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారనే విషయాన్ని బిగ్ బాస్ టీమ్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని'' తెలిపారు.