'శతమానంభవతి' సినిమా సక్సెస్ అయిన తరువాత దర్శకుడు సతీష్ వేగ్నేశతో తన బ్యానర్ లో మరో సినిమా చేయాలనుకున్నాడు దిల్ రాజు. స్టార్ హీరోతో సినిమా చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ఇందులో భాగంగా ముందుగా ఎన్టీఆర్ ని కలిసి కథ వినిపించాడు. ఆ కథ మరేదో కాదు.. నితిన్ నటించిన 'శ్రీనివాస కళ్యాణం'. కథ విన్న తరువాత ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డాడు.

ఆ తరువాత దిల్ రాజు కూడా మాస్ హీరోతో ఈ కథ చేయించాలంటే కొన్ని విషయాల్లో రాజీపడాలని నితిన్ ని హీరోగా ఫైనల్ చేసుకున్నాడట. నిజానికి దిల్ రాజు.. ఎన్టీఆర్ తరువాత రామ్ చరణ్ తో చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడట. కానీ నితిన్ కి కథ నచ్చి సినిమా చేస్తానని ముందుకు రావడంతో అతడితో సినిమాను రూపొందించారు. వాస్తవానికి స్టార్ హీరోలు యాక్సెప్ట్ చేసే అంశాలు ఈ సినిమాలో లేవు. అయినప్పటికీ దిల్ రాజుని కాదనలేక ఎన్టీఆర్ కథ విన్నాడు.

ఇప్పుడు సినిమా రిజల్ట్ ఎలాగో తెలిసిపోయింది. మొదటి షో నుండే నెగెటివ్ టాక్ వస్తున్నప్పటికీ చిత్రబృందం మాత్రం సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంది. మా సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందని కానీ ఇప్పుడు కలెక్షన్లు పుంజుకున్నాయని దిల్ రాజు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ డెబ్భై శాతం బయ్యర్లు లాస్ రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకుల అంచనా!